వివాదాల సిద్ధూ పెద్ద మనస్సు..!
మాజీ క్రికెటర్, ప్రస్తుత పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఎప్పుడూ వివాదాలకు కేరాఫ్ గా నిలుస్తారు. పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ప్రమాణస్వీకారానికి వెళ్లడం, దక్షిణ భారతదేశం కంటే పాకిస్థాన్ మేలు అని చెప్పి ఇటీవల వివాదాలకు కేంద్ర బింధువుగా నిలిచారు. తాజాగా ఆయన ఓ ప్రకటన చేసి పెద్ద మనస్సును చాటుకున్నారు. దసరా ఉత్సవాల్లో అమృత్ సర్ లో ఇటీవల రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. రైలు పట్టాలపై నిల్చుని రావణ దహనాన్ని చూస్తున్న వారిని లోకల్ ట్రైన్ ఢీకొనగా ఈ ఘటనలో 61 మంది మరణించారు. అయితే, ఈ ప్రమాదంలో మరణించిన వారి పిల్లలు అందరినీ తాను దత్తత తీసుకుంటానని సిద్ధూ ప్రకటించారు. వారిని ఉన్నత చదువులు చదివిస్తానని హామీ ఇచ్చారు. అలాగే కుటుంబపెద్దను కోల్పోయిన మహిళలను కూడా ఆదుకుంటానని తెలిపారు. కాగా, ఘటన జరిగిన రావణ దహన వేడుకకు సిద్ధూ సతీమణి, మాజీ మంత్రి నవజ్యోత్ కౌర్ సిద్ధూ ముఖ్యఅతిథిగా హాజరైన విషయం తెలిసిందే.