Fri Nov 22 2024 05:50:31 GMT+0000 (Coordinated Universal Time)
పదవి ఇవ్వకపోగా పీకేయడమేమిటో?
పురంద్రీశ్వరి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఆమెకు రాజ్యసభ పదవి ఇస్తారనుకున్నారు.
ఎన్నికల్లో గెలవడమే ముఖ్యం. అది బీజేపీ లక్ష్యం. ఎవరికైనా కొన్నాళ్లు సమయం ఇస్తుంది. వారి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని భావిస్తే క్షణం కూడా ఆలోచించదు. వెంటనే చర్యలకు దిగుతుంది. ఇప్పుడు పురంద్రీశ్వరి పరిస్థితి కూడా అంతే. పురంద్రీశ్వరి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఆమెకు రాజ్యసభ పదవి ఇస్తారనుకున్నారు. కానీ ఉన్న పదవుల నుంచి తప్పించడం అవమానకరమే. ఆమెకు గత ఏడాది ఛత్తీస్ఘడ్, ఒడిశా ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగించారు. అయితే ఒడిశా బాధ్యతల నుంచి తప్పించిన అధినాయకత్వం తాజాగా ఛత్తీస్ఘడ్ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి కూడా తప్పించడం చర్చనీయాంశంగా మారింది.
షాకు సన్నిహితుడు...
ఛత్తీస్ఘడ్ కు రాజస్థాన్ కు చెందిన ఓం మాధర్ ను అధిష్టానం ఇన్ఛార్జిగా నియమించింది. పురంద్రీశ్వరి తాము అనుకున్నట్లు పనితీరును ప్రదర్శించడం లేదన్న అభిప్రాయం అధినాయకత్వంలో వ్యక్తమవుతుంది. వచ్చే ఏడాది ఛత్తీస్ఘడ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇన్ఛార్జిని మార్చడం పార్టీ నాయకత్వానికి అనివార్యమయింది. అక్కడ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించాలంటే పురంద్రీశ్వరి తో సాధ్యం కాదని అధిానాయకత్వం భావించింది. అందుకే ఆమెను తప్పించి ఓం మాధుర్ ను నియమించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఓం మాధుర్ అమిత్ షాకు అత్యంత సన్నిహితుడు.
అంచనాలకు తగినట్లు...
పురంద్రీశ్వరి తమ అంచనాలకు తగినట్లు పనిచేయడం లేదని అధినాయకత్వం భావించిందంటున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో నేతలకు పదవులు ఇవ్వకపోగా ఉన్న పదవులను పీకేస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పురంద్రీశ్వరి నిజానికి పార్టీ పట్ల నిబద్దతగానే వ్యవహరిస్తారు. అయితే ఆమె గత కొంతకాలంగా అక్కడ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనకపోవడం, అక్కడి నేతలకు అందుబాటులో ఉండకపోవడం కూడా అధినాయకత్వం దృష్టికి వెళ్లింది. దీంతోనే పురంద్రీశ్వరిని ఇప్పటికే ఒడిశా ఇన్ఛార్జి నుంచి తప్పించిన అధిష్టానం తాజాగా ఛత్తీస్ఘడ్ నుంచి కూడా తప్పించింది.
ఏపీ నేతలకు లేని ప్రయారిటీ....
ఆంధ్రప్రదేశ్ పై భారతీయ జనతా పార్టీని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక్కడ పార్టీ ఎదుగుదల కష్టమేనని బీజేపీ కేంద్ర నాయకత్వానికి తెలియంది కాదు. అందుకే ఏ పోస్టులను భర్తీ చేయాలనుకున్నా పార్టీ హైకమాండ్ ఏపీ వైపు చూడటం లేదు. ఏపీకి ప్రాధాన్యత ఇచ్చేకంటే ఇతర రాష్ట్రాలకు ఇస్తే కొద్దో గొప్పో ప్రయోజనం ఉంటుందని భావిస్తున్న అధిష్టానం పార్టీ నేతలను లైట్ గానే తీసుకున్నట్లు కనపడుతుంది. మొత్తం మీద పురంధ్రీశ్వరి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటికీ ఆమెను ఛత్తీస్ఘడ్ ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించడంతో ఆమె వర్గీయులు ఆగ్రహంతో ఉన్నారు. అసహనానికి గురవుతున్నారు.
Next Story