Mon Dec 23 2024 00:06:32 GMT+0000 (Coordinated Universal Time)
పుతిన్ కు పరాభవం తప్పదా?
అతి తక్కువ కాలంలోనే పుతిన్ రాజకీయంగా ఎదిగాడు. 1999 డిసెంబరు 31న రష్యా ప్రధానిగా ఎన్నికయ్యారు.
అనుకున్నది ఒకటి జరుగుతున్నది మరొకటిగా తయారయింది రష్యా అధ్యక్షుడు పుతిన్ పరిస్థితి. ప్రపంచాన్ని శాసించాలనుకున్నాడు. ఆ ప్రపంచమే పుతిన్ ను వెలివేసే పరిస్థితి స్వయంగా తెచ్చుకున్నాడు. ఇప్పుడు కాలు వెనక్కు తీసుకునే పరిస్థితి లేదు. వెనక్కు తీసుకుంటే ఇప్పటి వరకూ తాను సంపాదించుకున్న పేరు, ప్రతిష్ట మంటగలిసిపోతాయి. అందుకే ప్రపంచ దేశాలను భయపెట్టేందుకు అణ్యాయుధాలు అంటూ హెచ్చరిక జారీ చేశాడు. పుతిన్ గురించి తెలిసిన వారెవ్వరికీ ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు పెద్దగా ఆశ్చర్యపర్చవు.
అమెరికా తర్వాత....
అమెరికా తర్వాత రష్యాను అత్యంత శక్తివంతమైన దేశంగా నిలపాలనుకున్నాడు. చాలా వరకూ సాధించారు. పుతిన్ అంటే రష్యా. రష్యా అంటే పుతిన్ అని ప్రపంచాన్ని నమ్మించాడు. పుతిన్ లెనిన్ గ్రాండ్ లో 1952 లో జన్మించాడు. లెనిన్ గ్రాండ్ స్టేట్ యూనివర్సిటీలో లా చదివాడు. అనంతరం ఆయన సోవియట్ యూనియన్ గూఢాచారి సంస్థ అయిన కేజీబీలో నిఘా అధికారిగా పుతిన్ 16 ఏళ్లు పనిచేశారు. ఆ సమయంలోనే పుతిన్ రష్యా ఉన్నత స్థాయి నాయకులకు దగ్గరయ్యారు. రాజకీయాలపై ఆసక్తి పెరిగి 1991లో ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయల్లో చేరిపోయారు. అప్పటి అధ్యక్షుడు బోరిస్ ఎల్సిన్ కోటరీలో ముఖ్యడయ్యారు.
తక్కువ సమయంలో ఎదిగి...
అతి తక్కువ కాలంలోనే పుతిన్ రాజకీయంగా ఎదిగాడు. 1999 డిసెంబరు 31న రష్యా ప్రధానిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆయన తన స్థానాన్ని పదిలం చేసుకోవడం కోసమే ప్రయత్నించారు. ప్రధాని లేదా అధ్యక్షుడు ఈ రెండు పదవుల్లోనే ఆయన ఉంటూ వస్తున్నారు. 2000 - 2004 వరకూ అధ్యక్షుడిగాను, 2004 -2008 వరకూ రెండోసారి అధ్యక్షుడిగానూ ఎనిమిదేళ్లు పనిచేశారు. తిరిగి 2008 - 2012 వరకూ రెండోసారి ప్రధానిగా పనిచేశారు. తర్వతా 2012 - 2018 వరకూ మూడోసారి పుతిన్ రష్యా అధ్యక్షుడయ్యాడు. 2018 తర్వాత రాజ్యాంగాన్ని మార్చి తానే శాశ్వత అధ్యక్షుడిగా పుతిన్ ప్రకటించుకున్నారు. అంటే 36 ఏళ్ల పాటు పుతిన్ రష్యా అధ్యక్షుడిగా ఉంటారు.
బలోపేతం చేసి...
అయితే పుతిన్ ఆర్థికంగా చితికిపోయిన రష్యాను బలోపేతం చేశాడు. అమెరికాకు దీటుగా రష్యాను నిలబెట్టాడు. అమెరికాను తన శత్రువుగా చూడటం మొదలుపెట్టాడు. అదే రష్యన్లలో ఆయనకు పేరు తెచ్చి పెట్టింది. రాజకీయంగా తన ప్రత్యర్థులను పూర్తిగా అణగదొక్కాడు. తన బలమైన ప్రత్యర్థి అలెక్సీ నవల్నీకి చుక్కలు చూపించారు. స్టాలిన్ తర్వాత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన రికార్డును అధిగమించనున్నారు. స్లాలిన్, కృశ్చేవ్, బ్రెజ్నేవ్ వంటి నేతలకు సమానంగా పేరు తెచ్చుకోవాలన్నది పుతిన్ ఆకాంక్ష. ఆ దిశగా కొంత సక్సెస్ అయినా నియంతగా ముద్రపడ్డారు.
ఇప్పుడు వ్యతిరేకత...
అంతర్జాతీయంగా అమెరికాను నిలువరించడంలో పుతిన్ సక్సెస్ అయ్యారు. ఉక్రెయిన్ నుంచి క్రిమియాను స్వాధీనం చేసుకోవడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. సిరియాలో అమెరికా జోక్యానికి అడ్డుకట్ట వేసి పాత సోవియట్ యూనియన్ ప్రజలకు గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధంతో సొంత దేశంలోనే ఆయన పై నిరసనలు మొదలయ్యాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న ఆర్థిక పరిస్థిితి యుద్ధంతో మరింత దిగజారింది. ద్రవ్యోల్బణంతో ధరలు పెరిగాయి. అన్ని దేశాల ఆంక్షలు విధించడంతో ప్రజలు కూడా ఇబ్బందులు పడక తప్పదు. ఉక్రెయిన్ తో యుద్ధంతో పుతిన్ ఇప్పుడు అంతర్జాతీయంగా ఒంటరి వాడయ్యాడని చెప్పాలి. దీని నుంచి బయటపడేందుకు ఎన్నేళ్లు పడుతుందో చెప్పలేని పరిస్థితి.
Next Story