ఇది లక్షా 30 వేల కోట్ల సర్జికల్ స్ట్రైక్స్..!
రాఫేల్ ఒప్పందంలో భారీ అవినీతి జరిగిందని మొదటి నుంచీ ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ, అనీల్ అంబానీపై తీవ్ర విమర్శలు చేశారు వీరిద్దరు కలిసి భారత రక్షణ బలగాలపై లక్ష్మా 30 వేల కోట్ల సర్జికల్ స్ట్రైక్స్ చేశారని ఆరోపించారు. ప్రధాని మోదీ అమరవీరులైన సైనికుల రక్తాన్ని అవమానపరుస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. రాఫేల్ డీల్ ను అనీల్ అంబానీకి చెందిన సంస్థకు కట్టబెట్టడం వెనుక ప్రధాని మోదీ ఉన్నారని, ఇది అతిపెద్ద కుంభకోణమని రాహుల్ గాంధీ విమర్శిస్తూ వస్తున్నారు. తాజాగా ఫ్రాన్స్ మాజీ అధ్యక్షులు హోలాండే ఫ్రెంచ్ మీడియాతో మాట్లాడుతూ... భారత ప్రభుత్వమే తమకు అనీల్ అంబానీకి చెదిన రిలయన్స్ డిఫెన్స్ సంస్థను సూచించడంతో తమకు ప్రత్యామ్నాయం లేకుండా పోయిందని పేర్కొన్నారు.
అర్హత లేకున్నా అప్పగించారు..!
దీంతో రాహుల్ గాంధీ ఆరోపణలకు బలం చేకూరినట్లయింది. దీంతో మళ్లీ రాహుల్ మోదీపై, రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పై విరుచుకుపడుతున్నారు. భారీ అవినీతికి కారణమైన వీరిద్దరూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 2015 ఏప్రిల్ 10న పారిస్ లో అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండేతో చర్చల అనంతరం ఆ దేశం నుంచి 36 రాఫేల్ యుద్ధ విమానాలను రూ.58 వేల కోట్లతో కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకుంటున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. రాఫేల్ యుద్ధవిమానాలు తయారు చేసే డస్సౌల్ట్ ఏవియేషన్ అనే సంస్థ అనీల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఏవియేషన్ సంస్థతో ఇందుకు గానూ భాగస్వామ్యం కదుర్చుకుంది. కానీ, రిలయన్స్ సంస్థకు అసలు ఏమాత్రం అర్హత లేదని, విమానాల కొనుగోలు ధర అమాంతం పెంచేసి అనీల్ అంబానీకి లబ్ధి చేకూర్చారని, ఇందులో దేశచరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు.
మేక్ ఇన్ ఇండియా కోసమే..
అయితే, రిలయన్స్ సంస్థను తాము సూచించలేదని భారత ప్రభుత్వం చెబుతూ వస్తోంది. ఇప్పుడు హోలాండే వ్యాఖ్యలతో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఇరుకున పడినట్లయింది. హోలాండే ప్రకటనతో వెంటనే ఫ్రాన్స్ ప్రభుత్వం స్పందించింది. భారత ప్రభుత్వ అనీల్ అంబానీ సంస్థను సూచించలేదని... ఏ సంస్థనైనా ఎంపిక చేసుకుని అవకాశం ఫ్రాన్స్ కంపెనీకి ఉందని స్పష్టం చేసింది. ఇక డస్సౌల్ట్ ఏవియేషన్ సంస్థ కూడా ఈ అంశంపై స్పందించింది. ‘మేక్ ఇన్ ఇండియా’కు ప్రాధాన్యత ఇస్తూ తాము అనీల్ అంబానీ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని స్పష్టం చేసింది. మొత్తానికి రాఫేల్ డీల్ లో హోలాండే వ్యాఖ్యలతో రాహుల్ గాంధీ కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.