Fri Nov 15 2024 06:33:33 GMT+0000 (Coordinated Universal Time)
పాపం..అమాయకుడు.. వీళ్లను సెట్ చేయగలరా?
గతంలో రాహుల్ వరంగల్ సభలో సీరియస్ వార్నింగ్ ఇచ్చి వెళ్లినా ఫలితం లేదు. హైదరాబాద్ ను వదిలి నియోజకవర్గాలకు వెళ్లడం లేదు
తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నేటి నుంచి ప్రారంభం అయింది. ఉదయం మక్తల్ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపుతుందా? కాంగ్రెస్ కు తెలంగాణలో ఊపిరి పోస్తుందా? అన్న ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. తెలంగాణ కాంగ్రెస్ కు ప్రత్యేకం. రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు ఒక కమాండ్ ఉంది. రాష్ట్రం తాము ఇచ్చినట్లుగా చెప్పుకునే ధైర్యం ఒక్క కాంగ్రెస్ మాత్రమే చేయగలదు. కానీ ఏం లాభం? రెండు దఫాల నుంచి నేతల కారణంగా కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి రాలేకపోయింది. తెలంగాణ ఇచ్చింది అనేకంటే తెచ్చుకున్నాం అనే నినాదమే టీఆర్ఎస్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో ఆ పార్టీ రెండు దఫాలు చతికల పడాల్సి వచ్చింది.
మూడోసారి కూడా...
ఇప్పుడు మూడోసారి ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఈ ఎన్నికల్లోనూ గత పరిస్థిితి ఎదురయితే ఏపీకి తెలంగాణ కాంగ్రెస్ ఏమాత్రం తీసిపోదనే చెప్పాలి. ఏపీ విషయం వేరు. విభజన జరిగింది కాబట్టి సహజంగా అక్కడ ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది. కానీ తెలంగాణ ప్రజలను తమ వైపు తిప్పుకోవడంలో స్థానిక నాయకత్వం రెండుసార్లు విఫలమయిందనే చెప్పాలి. మూడోసారి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ కొంత బలం పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే కాంగ్రెస్ కు క్షేత్రస్థాయిలో ఉన్న బలం, ఓటు బ్యాంకు బీజేపీకి లేవనే చెప్పాలి. కేంద్రంలో అధికారంలో ఉండటమే దానికి కలసి వచ్చే అంశం. అంతే తప్ప ఏ స్థాయిలో చూసినా కాంగ్రెస్ కు తెలంగాణ బీజేపీ పోటీకి రాదు.
నేతల మధ్య ఐక్యత...
కానీ నేతల్లో ఐక్యత, అనుసరిస్తున్న వ్యూహలు బీజేపీని క్రమంగా బలోపేతం చేస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ లో మాత్రం ఇప్పటికీ నేతల మధ్య ఐక్యత లేదు. పదవుల కోసం తప్పించి కష్టపడి పనిచేసి పార్టీని గెలిపించుకోవాలన్న ధ్యాస ఒక్కరికీ లేదు. ఒకరు పార్టీని ముందుకు తీసుకెళదామని ప్రయత్నాలు చేస్తుంటే పది మంది వెనక్కు లాగేందుకు ట్రై చేయడం పరిపాటిగా మారింది. అందుకే ప్రజల్లో పార్టీ మీద కంటే ఆ పార్టీలో ఉన్న నేతలపైనే ప్రజల్లో విశ్వాసం కొరవడిందని చెప్పాలి. వీరికి ఓటేసి గెలిపించినా పార్టీలో ఉండరన్న నమ్మకం ప్రజల్లో లేదు. ముందు దానిని అధిగమించాలి. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో దాదాపు పక్షం రోజులకు పైగానే సాగుతుంది. ప్రజలు యాత్రతో కొంత కాంగ్రెస్ వైపు మళ్లే అవకాశాలున్నాయి కాని, నేతల్లో మార్పు వస్తుందా? అన్నది మాత్రం డౌటే.
వార్నింగ్ లు ఇచ్చినా...
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో కొందరు కాంగ్రెస్ నేతలు యాత్రకు దూరంగా ఉన్నా అధికశాతం మంది యాత్రలోనే ఉంటారు. గతంలో రాహుల్ వరంగల్ సభలో సీరియస్ వార్నింగ్ ఇచ్చి వెళ్లినా ఫలితం లేదు. నేతలు పార్టీని వీడి వెళ్లదలచుకుంటే వెళ్లొచ్చని, హైదరాబాద్ ను వీడి నియోజకవర్గంలో ఉండాలన్న రాహుల్ హెచ్చరికను ఎవరూ కేర్ చేయడం లేదు. రాహుల్ వచ్చినప్పుడు మాత్రం కొందరు నేతలు హడావిడి చేస్తారు. తర్వాత షరా మామూలే. ఖర్చుకు వెనకాడటం కావచ్చు. మన కష్టం ఇతరులకు ఎందుకు లాభం చేయాలని అని భావించి కావచ్చు. అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈసారి టిక్కెట్లు అంత ఆషామాషీగా వచ్చే అవకాశం లేదు. సర్వేలను బట్టి టిక్కెట్లు అని రాహుల్ ఎప్పుడో చెప్పేశారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణ నేతలలో ఏ మేరకు మార్పు తెస్తుందన్నది చూడాల్సి ఉంది. రాహుల్ కష్టానికి ప్రతిఫలం దక్కుతుందా? అన్నది నేతల వైఖరిపైనే ఆధారపడి ఉంటుందన్నది నో డౌట్.
Next Story