Fri Nov 15 2024 01:59:55 GMT+0000 (Coordinated Universal Time)
గాంధీ యాత్ర - నేతల పాత్ర?
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు విశేష స్పందన లభిస్తుంది. ప్రస్తుతం మహారాష్ట్రాలో భారత్ జోడో యాత్ర జరుగుతుంది.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు విశేష స్పందన లభిస్తుంది. ప్రస్తుతం మహారాష్ట్రాలో భారత్ జోడో యాత్ర జరుగుతుంది. రాహుల్ గాంధీ వెంట జనం నడుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఊహించిన దానికంటే జనం నుంచి రెస్పాన్స్ ఎక్కువగా వచ్చింది. రాహుల్ గాంధీ కష్టం ఆయన అడుగులో కనిపిస్తుంది. పార్టీని బలోపేతం చేయడం కోసం ఆయన పెద్ద సాహసానికే ఒడిగొట్టారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకూ పాదయాత్ర అంటే ఆషామాషీ కాదు. కష్టంతో పాటు ఆర్థికంగా ఖర్చుతో కూడుకున్నది కూడా. అయితే రాహుల్ యాత్రకు జనసమీకరణ పార్టీ నేతలు చేయకున్నా స్వచ్ఛందంగా వచ్చిన వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇప్పుడు మహారాష్ట్రలో జనం యువనేతకు జే కొడుతున్నారు.
జనసమీకరణ చేయకున్నా...
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పాదయాత్రలోనే ఇది స్పష్టంగా బయటపడింది. ఏపీలో కాంగ్రెస్ కు నేతలు లేకపోయినా జనం మాత్రం రాహుల్ నడకలో పదం కలిపారు. ఆయనతో కలసి నడిచేందుకు ప్రయత్నించారు. తెలంగాణలోనూ అంతే. ఇప్పుడు మహారాష్ట్రలోనూ గాంధీ వెంట జనం పరుగులు తీస్తున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. రాహుల్ ను దగ్గరి నుంచి చూద్దామని ఒకటైతే.. పదేళ్లు అధికారంలో ఉన్న మోదీ సర్కార్ పై వ్యతిరేకత కొంత అని రాజకీయ విశ్లేషకులు సయితం అభిప్రాయపడుతున్నారు. అయితే మోదీ ప్రభుత్వం పై వ్యతిరేకత ఎంత? అన్నది ఇంకా తేలకపోయినా కొంత ఉందన్నది మాత్రం వాస్తవమేనని చెప్పుకోవాలి.
సాహస యాత్ర...
రాహుల్ తన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని సహజంగానే ఆశిస్తారు. ఇంత పెద్ద స్థాయిలో సాహసయాత్ర చేసి, కోట్లాది రూపాయలు వెచ్చించినా ఫలితం కన్పించకపోతే పడిన శ్రమంతా వృధాయేనని చెప్పక తప్పదు. అయితే రాహుల్ తన పని తాను చేశారు. పార్టీని బలోపేతం చేేసేందుకు ఆయన చిట్ట చివరి ప్రయత్నం చేశారు. అయితే మిగిలిన కష్టం స్థానిక రాష్ట్ర నేతలే చూసుకోవాల్సి ఉంటుంది. నాయకులంతా ఐక్యతగా ఉండాలి. మనస్పర్థలతో పార్టీని తమకు తాము భ్రష్టు పట్టించుకుంటే రాహుల్ గాంధీ పడిన కష్టానికి ఎలాంటి ఫలితం ఉండదన్నది అందరూ అంగీకరించే విషయమే.
స్థానిక నేతలే...
కాని 2024 ఎన్నికల సమయానికి జనాన్ని తమ వైపునకు తిప్పుకోవడంలో రాష్ట్రాల నేతలు సక్సెస్ అవుతారా? లేదా? అన్నది చూడాలి. రాహుల్ తన పని తాను చేశారు. తన వల్లనే పార్టీ అధికారంలోకి వస్తుందన్న ఆశ ఆయనకు లేదు. అలాగని రాష్ట్ర నేతలపై పూర్తిగా వదిలిపెట్టనూ లేరు. చేసిన ప్రయత్నానికి కొంత తోడవ్వాలి. రాహుల్ యాత్ర తర్వాత ఆ హీట్ తగ్గకుండా స్థానిక నేతలు ప్రయత్నించాలి. ప్రజలను పార్టీకి అనుకూలంగా మలచుకునేందుకు ప్రయత్నించాలి. ఇందుకు పార్టీ నేతల్లో ఐక్యత అవసరం. సమిష్టిగా కలసి పనిచేస్తే రాహుల్ పడిన కష్టానికి ఫలితం దక్కే అవకాశాలున్నాయన్నది పార్టీ పెద్దల అభిప్రాయం. అందుకే గాంధీ వెంట నడిచిన జనాన్ని అలాగే నడిచేలా చూసుకోవాల్సిన బాధ్యత స్థానిక కాంగ్రెస్ నేతలపైనే ఉంది. మరి ఆ దిశగా రాష్ట్రాల నేతలు ప్రయత్నిస్తారా? లేదా? అన్నది నేతలకే వదిలియాల్సి ఉంది.
Next Story