అక్కడ... రాహుల్ చికెన్ తిన్నారా..?
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎక్కడ దొరికుతాడా, ఎక్కడ ఆయన వైఖరిని వివాదాస్పదం చేయాలా అని కాంగ్రెస్ వ్యతిరేక పక్షాలు కాచుకు కూర్చుంటాయి. మీడియా కూడా ఆయన వైఖరిని, ఆయన చర్యలను ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాయి. అయితే, రాహుల్ ఎప్పుడూ ఏదో ఒక సందర్భంలో వీరికి చిక్కుతూ వివాదాల్లో ఇరుక్కుంటారు. ఇటీవల పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మాణంపై జరిగిన చర్చ సమయంలో రాహుల్ గాంధీ బాగానే ప్రసంగించారు. బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ విధానాలను తీవ్రస్థాయిలో ఎండగట్టారు. రాఫెల్ డీల్ లో అవినీతి జరిగిందనే విషయాన్ని బయటపెట్టారు. అంతా అయిపోయిన తర్వాత మోదీ దగ్గరకు వెళ్లి కౌగిలించుకుని షాక్ ఇచ్చాడు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా తర్వాత తన సీట్ లోకి వచ్చి కూర్చుని కన్నుకొట్టడంతో అప్పటివరకు తన కష్టం, ప్రసంగం అంతా బూడిదలో పోసిన పన్నీరు లా వృధాగా పోయింది. మీడియా మొత్తం తన ప్రసంగం కంటే రాహుల్ కన్ను కొట్టడంపై చర్చకే ప్రాధాన్యత ఇచ్చింది. దీంతో రాహుల్ కి బాగానే మైనస్ అయ్యింది.
విమాన ప్రమాదం నుంచి బయటపడినందున...
కాగా, తాను శివుడి భక్తుడిని అని స్వయంగా చెప్పుకున్న రాహుల్ గాంధీ ప్రస్తుతం మానస సరోవర్ యాత్రలో ఉన్నారు. కర్ణాటక పర్యటనలో ఆయన విమాన ప్రమాదం నుంచి తృటితో బయటపడ్డారు. పరమేశ్వరుడి కృప వల్లే తాను ప్రమాదం నుంచి బయటపడ్డానని భావించిన రాహుల్ గాంధీ మానస సరోవర్ యాత్ర చేస్తున్నారు. ఇప్పుడు ఇదే కూడా వివాదంగా మారింది. బీజేపీ కావాల్సినంతగా రాహుల్ హిందూ వ్యతిరేకి అన్న రేంజ్ లో ప్రచారానికి దిగింది. పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ నేపాల్ రాజధాని ఖాట్మాండోకు వెళ్లారు. అక్కడ ఓ సాధారణ వ్యక్తిలానే ‘వూటూ’ అనే రెస్టారెంట్ కు వెళ్లారు. రాహుల్ అలా సాధారణ వ్యక్తిగా తమ రెస్టారెంట్ కు రావడంతో యాజమాన్యంతో పాటు ప్రజలు కూడా షాక్ తిన్నారు. అయితే, రాహుల్ ఈ రెస్టారెంట్ లో టేబుల్ నెం-9లో కూర్చున్నారని, చికెన్ కుర్ కురే ఆర్డర్ చేశారని వార్తలు వచ్చాయి. రాహుల్ కు సప్లయ్ చేసిన వెయిటర్ ఈ విషయాన్ని చెప్పినట్లుగా వార్తలు వెలువడ్డాయి.
ఆయన తిన్నది శాకాహారమే బాబోయ్...
దీంతో, బీజేపీ నేతలు అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. హిందువులకు అత్యంత పవిత్ర మానస సరోవర్ యాత్రలో రాహుల్ గాంధీ చికెన్ తిన్నారని, ఇది హిందువుల మనోభావాలు దెబ్బతీయడమే అని విమర్శలు గుప్పించారు బీజేపీ నేతలు. నెటిజన్లు కూడా రాహుల్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాహుల్ ఆహారం అంశం తీవ్ర వివాదాస్పదమవడంతో సదరు రెస్టారెంట్ స్పందించింది. రాహుల్ గాంధీ పూర్తిగా శాఖాహారమే తిన్నారని, ఏ వెయిటర్ కూడా చికెన్ తిన్నారని చెప్పలేదని వివరణ ఇచ్చింది. దీంతో రాహుల్ గాంధీకి కొంత ఊరట లభించింది. మొత్తానికి రాహుల్ తన హోదాను పక్కనపెట్టి సాధారణ వ్యక్తిలా రెస్టారెంట్ కు వెళ్లి భోజనం చేయడం మీడియాలో హైలెట్ కావాలి. కానీ, రాహుల్ తిన్న ఆహారంపై వివాదం తలెత్తింది. దీన్ని బట్టి చూస్తే రాహుల్ గాంధీ ఇటువంటి వివాదాలకు చిక్కకుండా చాలానే జాగ్రత్తలు తీసుకోవాలనిపిస్తోంది.