నిధులు, నియామకాలు వారికే...!!
చంద్రబాబునాయుడికి తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానని, హైదరాబాద్ ను ప్రపంచ చిత్రపటంలో నిలిపినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నానని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. సనత్ నగర్ రోడ్ షోలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ మామూలు నగరం కాదన్నారు. ఈ నగరం ఏ ఒక్కరిదో కాదని, అందరిదీనని, ఇక్కడ ఉన్న వాళ్లు అమెరికాను కూడా శాసిస్తున్నారన్నారు. ఈ విషయాన్ని అక్కడి రాష్ట్రపతి చెప్పారన్నారు. తెలంగాణలో ఒక కుటుంబానికే నిధులు, నియామకాలు అందాయన్నారు. అది కేసీఆర్ కుటుంబానికేనని చెప్పారు. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాలన్నింటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతిచ్చారన్నారు. ఇదే ప్రజాకూటమితో లోక్ సభ ఎన్నికలకు వెళుతున్నామన్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, మిజోరాంలలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని, తెలంగాణలో ప్రజాకూటమి గెలుస్తుందని చెప్పారు. బీజీపీకి బీ టీం టీఆర్ఎస్ అవునో కాదో ఆ పార్టీ నేతలే చెప్పాలన్నారు. అన్ని అంశాలకూ పార్లమెంటులో మద్దతిచ్చి లోపాయికారీగా మోదీతో ఒప్పందాన్ని కేసీఆర్ కుదుర్చుకున్నారన్నారు. అందరూ కలసి సమిష్టిగా పనిచేసి ప్రజాకూటమి విజయానికి కృషి చేయాలని రాహుల్ గాంధీ కోరారు.