ఆ దమ్ము, ధైర్యం ఉందా..?
గాంధీ భవన్ లో కూర్చుని పార్టీ పోస్టులు అమ్ముకునే వారికి, కార్యకర్తలను పట్టించుకోని వారికి తనకు షోకాజ్ నోటీసులు ఇచ్చే అర్హత లేదని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. షోకాజ్ కు సమాధానం ఇవ్వడానికి రెండురోజుల సమయం తనకు అవసరం లేదని.. రెండు గంటలు చాలన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక పవనాలు వస్తున్నాయని, అందరూ కలిసి కష్టపడితే కాంగ్రెస్ పార్టీని గెలిపించవచ్చని పేర్కొన్నారు. కానీ, కొందరు నేతల తప్పుల వల్ల కాంగ్రెస్ కార్యకర్తలు బాధపడుతున్నారన్నారు. ఏపీలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుందని తెలిసినా సోనియా గాంధీ హైదరాబాద్ తో కూడిన తెలంగాణ ఇచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సి ఉన్నా గత ఎన్నికల్లో కొందరు నేతల స్వర్థం వల్ల ఓటమి పాలయ్యామని పేర్కొన్నారు. మళ్లీ ఈ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి ఉందన్నారు.
బూతులు తిడితేనే పదవులా..?
కొత్తగా వేసిన కమిటీల్లో పార్టీ మారిన సురేష్ రెడ్డి పేరు ఉందంటే పార్టీ నిద్రపోతుందా అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం పోరాడిన నాయకులను పక్కనపెట్టి కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం సరికాదన్నారు. కేసీఆర్ ను బూతులు తిడితేనే పదవులు వస్తాయా..? సంస్కారంతో మాట్లాడిన వారికి పదవులు రావా..? అని ప్రశ్నించారు. ఇప్పటికీ 75 ఏళ్లుగా ఉన్న నేతలు రిటైర్డ్ అయ్యి కృష్ణా.. రామా అనకుండా మొదటివరుసలో ఉంటే పార్టీ ఎలా పరిగెడుతుందన్నారు. వంద సీట్లు ఉన్న రాష్ట్రానికి 41 మందితో ఎలక్షన్ కమిటీ, 53 మందితో జెంబో కమిటీలు వేస్తే ఏమి చర్చిస్తారు. తాను కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి క్రమశిక్షణ కలిగిన సైనికుడిలా పనిచేస్తున్నానన్నారు. పార్టీకి నష్టం కలిగించాలని తాను మాట్లాడలేదని.. కేవలం కార్యకర్తల ఆవేదన మాత్రమే చెప్పానన్నారు. తాను ఏ పదవినీ కోరుకోవడం లేదని.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే తన లక్ష్యమన్నారు. కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీ కోవర్టులు ఉన్నారని ఆరోపించారు. తనపై చర్యలు తీసుకునే దమ్ము ఎవరికీ లేదన్నారు. 41 మందితో ఉన్న ఎన్నికల కమిటీని 9 మందికి కుదించాలని, ప్రతి నియోజకవర్గంలో గెలిచే అభ్యర్థులను ఎంపిక చేయాలని పేర్కొన్నారు.