Sat Nov 23 2024 01:49:59 GMT+0000 (Coordinated Universal Time)
బర్నింగ్ టాపిక్... వైసీపీలో ఆ ఒక్కరూ ఎవరు?
రాజ్యసభ పదవులు వైసీపీ నేతలను ఊరిస్తున్నాయి. వచ్చే నెలలోనే నాలుగు రాజ్యసభ పదవులు ఖాళీ కానున్నాయి
రాజ్యసభ పదవులు వైసీపీ నేతలను ఊరిస్తున్నాయి. వచ్చే నెలలోనే నాలుగు రాజ్యసభ పదవులు ఖాళీ కానున్నాయి. ఇందులో మూడు బీజేపీ, ఒకటి వైసీపీ సిట్టింగ్ స్థానాలు. అయితే ఈసారి నాలుగు రాజ్యసభ పదవులు వైసీపీ ఖాతాలోనే పడనున్నాయి. బీజేపీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, సుజనా చౌదరి, సురేష ప్రభుతో పాటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పదవీ కాలం పూర్తికానుంది. ఈ నేపథ్యంలో నాలుగు రాజ్యసభ పదవులు ఎవరికి దక్కుతాయన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
రెండు సీట్లు రిజర్వ్...
నాలిగింటిలో ఒకటి సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి తిరిగి జగన్ రెన్యువల్ చేస్తారు. ఇక రెండో రాజ్యసభ సీటు సినీనటుడు ఆలీకి కన్ఫర్మ్ అయినట్లే. ఇటీవల ఆలీ జగన్ తో సమావేశమైనప్పుడు ఆయనకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. వారం రోజుల్లోనే ఆలీ రాజ్యసభ సీటుపై వైసీపీ అధికారిక ప్రకటన చేసే అవకాశముంది. ఈ రెండు సీట్లు ముందుగానే రిజర్వ్ కావడంతో ఇక మిగిలింది రెండు సీట్లే.
బీసీలకు నో ఛాన్స్....
ఒక సీటు ఉత్తర భారత దేశానికి చెందిన పారిశ్రామికవేత్తకు ఇవ్వాలన్న యోచనలో జగన్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అదే నిజమైతే ఇక మిగిలేది ఒక్క సీటు మాత్రమే. ఈ సీటు ఎవరికి ఇస్తారన్నది పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో రాజ్యసభ స్థానాలు ఖాళీ అయినప్పుడు ఇద్దరు బీసీలకు ఇచ్చారు. మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లను రాజ్యసభకు పంపడంతో ఈసారి బీసీలకు అవకాశం లేనట్లే. మూడు సీట్లలో ఒకటి రెడ్డి, ఒకటి ముస్లింలకు కన్ఫర్మ్ కావడంతో ఎస్సీలను ఒకరిని రాజ్యసభకు ఎంపిక చేసే అవకాశముంది.
కాపులకు ఇస్తారా?
ఎస్సీలకు అవకాశమిస్తారా? లేదా ఉత్తరాంధ్రలో వెనకబడిన వర్గాల నుంచి ఎవరినైనా రాజ్యసభకు పంపుతారా? కాపులకు అవకాశమిస్తారా? కమ్మ సామాజివర్గానికి ప్రాధాన్యత ఇస్తారా? అన్నది చర్చనీయాంశమైంది. కిల్లి కృపారాణి, దాడి వీరభద్రరావు వంటి నేతలు పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే కాపులకు ఇవ్వాలనుకుంటే ముద్రగడ పద్మనాభంను ఎంపిక చేసే అవకాశాలున్నాయని, ఆయన అంగీకరించకపోతే అదే సామాజికవర్గానికి చెందిన బలమైన నేత పేరును కూడా జగన్ పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే మర్రి రాజశేఖర్ కు జగన్ మాట ఇచ్చారంటున్నారు. మర్రి రాజశేఖర్ పేరును చివరి నిమిషంలో తప్పించే అవకాశమూ లేకపోలేదు.పారిశ్రామిక వేత్తకు సీటు కేటాయించకపోతే ఒక సీటు మాత్రం మిగులుతుంది. మొత్తం మీద మిగిలిన ఒక సీటు ఎవరదన్నది వైసీపీలో బర్నింగ్ టాపిక్ అయింది.
Next Story