Thu Nov 14 2024 22:03:57 GMT+0000 (Coordinated Universal Time)
మూడోసారి మూడ్ లేదట
కమలాపురం నియోజకవర్గం నుంచి రవీంద్రనాధ్ రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు
రాజకీయాల్లో సెంటిమెంట్ కు ఉన్న ప్రాధాన్యం ఎక్కడా ఉండదు. అందుకే రాజకీయ నేతలు మఠాధిపతులు, పీఠాధిపతులు చుట్టూ చక్కర్లు కొడుతుంటారు. ఏ రాజకీయ నేత అయినా తాను గెలవాలనే కోరుకుంటాడు కాని ఓటమిని అంగీకరించడు. అది ముఖ్యమంత్రి నుంచి సాధారణ సర్పంచ్ వరకూ అదే అభిప్రాయంతో ఉంటాడు. అందునా సెంటిమెంట్ భయపెడుతుంటే దానిని పక్కకు తప్పించే కంటే తానే పక్కకు తప్పుకోవాలనుకుంటాడు తెలివైన రాజకీయ నేత. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేనమామ రవీంద్రనాధ్ రెడ్డి పరిస్థితి కూడా అలాగే ఉందంటున్నారు.
వైఎస్ కుటుంబానికి కంచుకోట....
కడప జిల్లా అంటే వైఎస్ కుటుంబానికి కొంత అనుకూలంగా ఉంటుంది. పది శాసనసభ నియోజకవర్గాలుంటే ఒకటో రెండో నియోజకవర్గాలు మినహాయించి మిగిలిన వాటిల్లో గెలుపు అవకాశాలు 90 శాతం ఉంటాయని రాజకీయ విశ్లేషకులు సయితం అంగీకరిస్తున్న విషయం. గత ఎన్నికల్లోనూ కడపలో పదికి పది నియోజకవర్గాలతో పాటు పార్లమెంటు నియోజకవర్గాన్ని వైసీపీ గెలుచుకుంది. ఇక అసలు విషయానికి వస్తే కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గానికి జగన్ మేనమామ పి. రవీంద్రనాధ్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
బలమైన కారణాలతో...
రవీంద్రానాధ్ రెడ్డి రెండోసారి కమలాపురం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికల్లో వరసగా ఆయన విజయం సాధించారు. 2014లో ఐదువేలు మెజారిటీ వస్తే, 2019 ఎన్నికల్లో 27 వేల మెజారిటీ వస్తుంది. హ్యాట్రిక్ విజయం కోసం ఎవరైనా చూస్తారు. కానీ రవీంద్ర నాధ్ రెడ్డి మాత్రం 2024 ఎన్నికల్లో కమలాపురం నుంచి పోటీ చేయడానికి ఇష్టపడటం లేదంటున్నారు. ఆయన నియోజకవర్గానికి మారాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారని చెబుతున్నారు. మూడోసారి కమలాపురం నియోజకవర్గంలో పోటీ చేసే మూడ్ లేదంటున్నాట జగన్ మేనమామ. అయితే అందుకు బలమైన కారణాలున్నాయంటున్నారు.
హ్యాట్రిక్ విక్టరీని....
కమలాపురం చరిత్ర చూస్తే మూడో సారి ఎవరూ మళ్లీ ఎమ్మెల్యేగా ఇంతవరకూ ఎవరూ ఎన్నిక కాలేదు. మూడోసారి పోటీ చేస్తే ఓటమి తప్పదన్న సెంటిమెంట్ కమలాపురం నియోజకవర్గంలో ఉంది. 1985, 1989లో వరసగా గెలిచిన మైసూరారెడ్డి 1994లో మాత్రం వీరశివారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక 2004లో టీడీపీ నుంచి పోటీ చేసిన వీరశివారెడ్డి, 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అంటే పార్టీలు మారినా రెండుసార్లు వీర శివారెడ్డి విజయం సాధించారు. అదే వీర శివారెడ్డికి మాత్రం 2014 ఎన్నికల్లో టిక్కెట్ దక్కకపోవడంతో హ్యాట్రిక్ విక్టరీని కొట్ట లేకపోయారు.
వైఎస్ కుటుంబ సభ్యుడిగా...
అందుకే కమలాపురం నుంచి రవీంద్ర నాధ్ రెడ్డి 2024లో పోటీ చేసేందుకు వెనుకాడుతున్నారన్న టాక్ వైసీపీలో నడుస్తుంది. ముఖ్యమంత్రి మేనమామగా ఆయన ఏ నియోజకవర్గం కోరుకున్నా టిక్కెట్ దక్కే అవకాశాలున్నాయి. అందుకే నియోజకవర్గాన్ని మార్చాలని ఆయన భావిస్తున్నారని చెబుతున్నారు. వైఎస్ కుటుంబ సభ్యుడిగా ఓటమి పాలయితే పరువు పోతుందని ఆయన మరొక నియోజకవర్గాన్ని వెదుక్కుంటున్నారని చెబుతున్నారు. కడప శాసనసభ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అంజాద్ భాషాకు రెండోసారి మంత్రి పదవి రెన్యువల్ చేసింది కూడా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వడం లేదని ముందుగానే చెప్పి మంత్రివర్గంలోకి తీసుకున్నారన్న ప్రచారం కూడా ఉంది. మొత్తం మీద రవీంద్రనాధ్ రెడ్డి సెంటిమెంట్ కు బాగానే భయపడుతున్నారు. మరి చివరకు ఏ నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి
Next Story