Sun Dec 22 2024 17:33:06 GMT+0000 (Coordinated Universal Time)
రాయపాటి రగిలిపోతున్నాడా? కీలక నిర్ణయం తప్పదా?
రాయపాటి సాంబశివరావు కుటుంబం టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది.
గుంటూరు జిల్లాలో చంద్రబాబు పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో గత ఎన్నికల్లో దెబ్బతిన్న టీడీపీకి చికిత్స చేయాలని నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీడీపీ పనితీరు మెరుగుపడలేదు. రాజధాని అమరావతి ఉన్న జిల్లాలో ఈరకమైన పరిస్థితి నుంచి పార్టీని చక్కదిద్దడానికి చంద్రబాబు ప్రయత్నాలు మొదలు పెట్టారు. కార్యకర్తల్లో ఉత్సాహం ఉన్నా నేతలు మాత్రం గడప దాటి బయటకు రావడం లేదు.
గత ఎన్నికల్లో....
గత ఎన్నికల్లో రేపల్లె, గుంటూరు తూర్పు నియోజకవర్గాల్లోనే టీడీపీ విజయం సాధించింది. అయితే ఈసారి రాజధాని అమరావతి అంశంతో నెంబర్ రివర్స్ అవుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. కానీ అది సాధ్యమయ్యేలా కన్పించడం లేదు. కొందరు నేతలు మాత్రమే యాక్టివ్ గా ఉమ్మడి గుంటూరు జిల్లాలో యాక్టివ్ గా ఉన్నారు. ఒంగోలు మహానాడుకు కూడా నలుగురైదుగురు నేతలు మాత్రమే జనసమీకరణ చేశారన్న నివేదికలు చంద్రబాబుకు అందాయి.
రెండు టిక్కెట్లు....
ప్రధానంగా రాయపాటి కుటుంబం టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. రాయపాటి వయసు రీత్యా ఈసారి పోటీ చేయడం కష్టమే. ఆయన ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయనని తన సన్నిహితుల వద్ద చెబుతున్నారు. కానీ తన వారసులను మాత్రం పోటీ చేయించాలని కోరుకుంటున్నారు. తమ కుటుంబానికి రెండు సీట్లు కావాలని రాయపాటి సాంబశివరావు ఆ మధ్య చంద్రబాబును నేరుగా కోరారు. కానీ ఒక్క టిక్కెట్ కూడా రాయపాటి కుటుంబానికి ఇవ్వడం కష్టమేనంటున్నారు. ఇంతవరకూ ఆ కుటుంబానికి పార్టీ అధినేత నుంచి స్పష్టమైన హామీ లభించలేదు.
సాధ్యంకాదని...
సత్తెనపల్లి నియోజకవర్గం టిక్కెట్ ను రాయపాటి శ్రీనివాస్ కు ఇవ్వాలని సాంబశివరావు కోరుతున్నారు. అక్కడ కోడెల కుటుంబానికి ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారంటున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని రాయపాటి శైలజ కోరుతున్నారు. అక్కడ తెనాలి నియోజకవర్గం పొత్తులో భాగంగా జనసేనకు వెళితే ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు ఇవ్వాలనుకుంటున్నారు. దీంతో అక్కడ శైలజకు అవకాశం లేదు. రాయపాటి కుటుంబానికి నరసరావుపేట లోక్ సభ స్థానం ఇవ్వాలన్న యోచనలో చంద్రబాబు ఉన్నారు. కానీ రాయపాటి కుటుంబం అందుకు ఇష్టపడటం లేదు. దీంతో రాయపాటి సాంబశివరావు కొంత ఆగ్రహంతో ఉన్నారు. ఆయన కుటుంబం కూడా పార్టీకి దూరంగా ఉంటోంది.
Next Story