Sat Nov 23 2024 01:53:00 GMT+0000 (Coordinated Universal Time)
ప్రాణాలు తీస్తున్న ఎలక్ట్రిక్ బైకులు.. ఎవరిదీ వైఫల్యం ?
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ-బైక్స్ బ్యాటరీలు పెద్దశబ్దంతో పేలిన ఘటనలున్నాయి. ఇలా వరుసగా ఈ-బైక్ లు పేలుతుండటంతో..
ఈ - బైక్స్. పెట్రోల్ లేకుండా కేవలం ఛార్జింగ్ తో నడిచే వెహికల్స్ ఇవి. పెట్రోల్ ధరలు అమాంతం పెరుగుతున్న సమయంలో ఈ ఈ-బైక్స్ మార్కెట్లోకి వచ్చాయి. వినియోగదారులు కూడా పెట్రోల్ ఖర్చు తగ్గుతుంది కదా అని.. ఈ-బైక్స్ ను కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. ఆరంభంలో బాగానే ఉన్నా.. రోజులు గడిచే కొద్దీ ఈ-బైక్ లలోని బ్యాటరీలు పేలడం మొదలయ్యాయి. బ్యాటరీల పేలుళ్లకు చాలామంది ప్రాణాలు కోల్పోయారు. కొన్ని నెలల క్రితం తమిళనాడులో ఇంటిఆవరణలో ఈ బైక్ బ్యాటరీ పేలడంతో.. తండ్రి-కూతురు ఊపిరాడక మరణించారు.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ-బైక్స్ బ్యాటరీలు పెద్దశబ్దంతో పేలిన ఘటనలున్నాయి. ఇలా వరుసగా ఈ-బైక్ లు పేలుతుండటంతో.. అసలు అవి ఎందుకు అలా పేలిపోతున్నాయన్న అనుమానాలు రేకెత్తాయి. తయారీలో నాణ్యతా లోపాలు, కంపెనీల పట్టింపులేని తనం, యూజర్ గైడ్పై అవగాహన కల్పించకపోవడం వల్ల వేసవి మొదలైనప్పటి నుంచి దేశంలో రోజుకో చోట ఎలక్ట్రిక్ బైకులు గ్రనేడ్లలా పేలిపోతూ అగ్ని ప్రమాదాలకు కారణం అవుతున్నాయని నిపుణులు అన్నారు. వేసవి ఉష్ణోగ్రతలు తట్టుకోలేక బ్యాటరీలు పేలుతున్నాయనడం నిజమే అయితే.. తాజాగా సికింద్రాబాద్ రూబీ లాడ్జ్ వద్ద జరిగిన ప్రమాదానికి కారణం ఏంటి ? ఇది వేసవి కాలం కాదు. ఉష్ణోగ్రతలు పెరిగిన సమయంలోనూ బైక్ ల బ్యాటరీలు పేలలేదు.
తెల్లవారుజామున లాడ్జి సెల్లార్ లో పార్క్ అయి ఉన్న ఈ బైక్ లలోని బ్యాటరీలు పెద్దశబ్దంతో పేలాయి. ఆ మంటలు సెల్లార్ లో ఉన్న జనరేటర్ కు అంటుకోవడంతో.. 8 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. మన దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఉపయోగిస్తున్న లిథియం ఐయాన్ బ్యాటరీలను చైనా, దక్షిణ కొరియాల నుంచి దిగుమతి చేసుకున్నవి ఎక్కువగా ఉంటున్నాయి. ఈ బ్యాటరీలు అక్కడి వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా తయారు చేస్తున్నారు. కానీ మన దేశంలో.. వర్షాకాలంలోనూ 35-40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. అలాంటి సమయాల్లో బ్యాటరీల ఉష్ణోగ్రతలు పెరగడంతో అవి పేలుతున్నాయన్నది కొందరి అభిప్రాయం.
కాగా.. వాతావరణంతో సంబంధం లేకుండా బ్యాటరీ బైకులు పేలుతుండటంతో.. ప్రజలు వాటిని కొనాలంటేనే జంకుతున్నారు. బ్యాటరీ బైకులు పేలుతుండటంతో..ఓలా ఇప్పటికే తన వెహికల్స్ ని రీకాల్ చేసింది. మిగతా కంపెనీలు కూడా ఈ-బాక్ లను రీకాల్ చేసి, మళ్లీ మళ్లీ ప్రమాదాలు జరగకుండా.. వాటిలో ఉన్న లోపాలను సరిచేయాలని ప్రజలు కోరుతున్నారు.
Next Story