Tue Dec 24 2024 02:50:38 GMT+0000 (Coordinated Universal Time)
కామ్రేడ్లలో కలవరం.. ఊహించలేదట
తాజాగా జరిగిన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల్లో వామపక్షాలకు షాకిచ్చాయనే చెప్పాలి
సహజంగా వామపక్షాలకు అనుబంధ సంఘాలు బలంగా ఉంటాయి. కార్మిక సంఘం, ఉపాధ్యాయ సంఘాలు వంటివి ఆ పార్టీలకే దన్నుగా ఉంటాయి. తమ డిమాండ్ల సాధనకు గట్టిగా పోరాడతాయని భావించి కావచ్చు. సమస్యలపై తక్షణమే స్పందించారని కావచ్చు. పోరాటంలో తమకు అండగా నిలుస్తాయన్న కారణాలతోనే ఉపాధ్యాయ సంఘాలు వామపక్ష పార్టీలకు తోడుగా నిలుస్తాయి. ఆ బలంతోనే సాధారణ ఎన్నికల్లోనూ కొద్దోగొప్పో వామపక్ష పార్టీలు తమ ఉనికిని చాటుకుంటున్నాయి. దశాబ్దకాలంగా ఏపీలోనూ, ఐదేళ్ల నుంచి తెలంగాణలోనూ ఏపీ శాసనసభలో ప్రాతినిధ్యం లేదు.
బీజేపీ అభ్యర్థికే...
తాజాగా జరిగిన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల్లో వామపక్షాలకు షాకిచ్చాయనే చెప్పాలి. తెలంగాణ ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ మద్దతిచ్చిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి విజయం సాధించారు. ఇక్కడ వామపక్ష పార్టీలు పరాజయం పాలయ్యాయి. అందుకు ప్రధాన కారణం అధికార బీఆర్ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలవడమే. తమ డిమాండ్లను మండలిలో వినిపించేందుకు కూడా వామపక్ష పార్టీలు వెనుకంజ వేస్తాయని భావించి ఆ అభ్యర్ధి వైపు చూడను కూడా చూడలేదు. టీచర్లు తమ వాదనను బలంగా వినిపించాలంటే బీజేపీ అభ్యర్థి బెటర్ అని భావించారు. అందుకే ఆయన వైపు మొగ్గుచూపారు.
అధికారపార్టీతో...
మునుగోడు ఉప ఎన్నికల నుంచి వామపక్ష పార్టీలు అధికార పార్టీతో జట్టుకట్టాయి. వచ్చే సాధారణ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ తో కలసి నడిచేందుకు సిద్ధమయ్యాయి. ఇక బీఆర్ఎస్ జాతీయ పార్టీగా అవతరించిన తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా వామపక్షాలు ఆ పార్టీ సరసన చేరాయి. వచ్చే ఎన్నికలకు కూడా బీఆర్ఎస్ తో కలసి పోటీ చేయాలని నిర్ణయించాయి. మరో వైపు టీచర్ల బదిలీలు, పదోన్నతుల వంటి సమస్యల విషయంలోనూ అధికార పార్టీకి వ్యతిరేకంగా ఎటువంటి ఆందోళనలు చేపట్టలేదు. అనుబంధ ఉపాధ్యాయ సంఘాలు సయితం మీడియా సమావేశాలకే పరిమితమవ్వడంతో టీచర్లు బీజేపీ మద్దతు పలికిన అభ్యర్థికి అండగా నిలిచారు. దీంతో గెలవాల్సిన స్థానంలోనూ వామపక్ష పార్టీ ఓటమి పాలయింది.
ఏపీలో రివర్స్....
ఇక ఆంధ్రప్రదేశ్ దీనికి రివర్స్ లో పరిస్థితి కనిపించింది. అక్కడ టీచర్లకు మద్దతుగా అనేక పోరాటాలు చేసిన అనుబంధ సంఘలను కాదనుకుని అక్కడి ఉపాధ్యాయులు అధికార పార్టీవైపు మొగ్గు చూపాయి. పీడీఎఫ్ నుంచి పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. తెలుగుదేశం పార్టీ మద్దతిచ్చినా ఫలితం లేకుండా పోయింది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మద్దతు పలికిన టీడీపీ టీచర్స్ ఎమ్మెల్సీలో కూడా సహకరించాలని కోరినా ఉపాధ్యాయులు అధికార పార్టీవైపు మొగ్గు చూపారు. దీనికి కారణాలేంటన్న దానిపై వామపక్ష పార్టీలు లోతుగా అథ్యయనం చేయాల్సి ఉంటుంది. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో వామపక్ష పార్టీలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. చట్టసభల్లోకి సులువుగా ప్రవేశించే అవకాశం చేజారిపోయింది.
Next Story