Mon Dec 23 2024 07:59:17 GMT+0000 (Coordinated Universal Time)
ఏమయ్యా జీవీఎల్.. అందుకేనా ఈ తంటాలు
ఇటీవల కాలంలో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కాపు సమస్యలను తన భుజానకెత్తుకున్నట్లే కనపడుతుంది
ఎన్నికలు దగ్గరపడే సమయంలో ఓటర్ల మీద రాజకీయ నాయకులకు వల్లమాలిన ప్రేమ వస్తుంది. ఎంతగా అంటే నాలుగేళ్లు కనపడని సమస్య ఎన్నికల ఏడాది మాత్రం బిగ్ ప్రాబ్లంగా చూస్తారు. దానిని పరిష్కరించడానికి తాము తప్ప ఎవరూ కృషి చేయలేదని నమ్మబలికే ప్రయత్నం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో బలంగా ఉన్న కాపు సామాజికవర్గాన్ని మంచి చేసుకోవడం కోసం ఇప్పటి నుంచే పార్టీలు చర్యలు ప్రారంభించాయి. కాపుల కోసం మేము.. మా వెంటే కాపులు అన్నట్లుగా కొన్ని పార్టీలు వ్యవహరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. జాతీయ పార్టీ బీజేపీ కూడా కాపుల ఓట్ల కోసం పడే తంటాలు చూస్తుంటే ఔరా అని అనిపించక మానదు.
పదే పదే కాపు సమస్యలను...
ఇటీవల కాలంలో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కాపు సమస్యలను తన భుజానకెత్తుకున్నట్లే కనపడుతుంది. కాపులకు తామే న్యాయం చేయగలమన్న సంకేతాలను ఆ సామాజికవర్గంలోకి తీసుకెళ్లేందుకు జీవీఎల్ పెద్ద ప్రయత్నమే చేస్తున్నారు. మొన్న ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లలో కాపులకు రిజర్వేషన్లను కల్పించడంపై రాజ్యసభలో ప్రశ్నించిన జీవీఎల్ నరసింహారావు కేంద్ర ప్రభుత్వం నుంచి వారికి సానుకూలమైన సమాధానం రావడంతో అందులో తామే సక్సెస్ అయ్యామని చెప్పుకుంటున్నారు. కాపుల చేత జీవీఎల్ సన్మానాలు కూడా చేయించుకున్నారు.
ీఈరోజు రంగాపై...
ఇక తాజాగా ఈరోజు రాజ్యసభలో జీవీఎల్ నరసింహారావు వంగవీటి మోహనరంగా పేరును ప్రస్తావించారు. వంగవీటి రంగా పేరును కృష్ణా జిల్లా లేదా మచిలీపట్నం జిల్లాకు పెట్టాలని ఆయన కోరారు. విజయవాడ ఎయిర్పోర్టుకు రంగా పేరు పెట్టాలన్నారు. రాజ్యసభ జీరో అవర్ లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. బీజేపీకి కాపుల అంశం ఇప్పుడే బీజేపీకి ఎందుకు గుర్తుకొచ్చింది? ఏపీలో అధిక సంఖ్యలో ఉన్న ఆ సామాజికవర్గాన్ని దగ్గర చేసుకోగలిగితే అధికారానికి చేరువయ్యే అవకాశాలుంటాయని భావించి కమలనాధులు కాపు నామస్మరణం చేస్తున్నారు. జనసేన సేన అధినేత పవన్ కల్యాణ్ కు ఎటూ ఆ సామాజికవర్గంలోని మెజారిటీ ప్రజల మద్దతు ఉంటుందంటున్నారు. అదే సమయంలో బీజేపీ కూడా కాపు సామాజికవర్గానికి చెందిన నేతకే పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించింది.
అందరూ నిలబడతారా?
గత అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కావచ్చు.. ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజు కావచ్చు.. అదే సామాజికవర్గానికి చెందిన వారు. కానీ కాపులు బీజేపీ వైపు పెద్దగా చూడకపోవడంతోనే జీవీఎల్ నరసింహారావు వరసగా రాజ్యసభలో పదే పదే కాపుల అంశాలను ప్రస్తావిస్తున్నారన్న టాక్ వినపడుతుంది. అంతే కాకుండా కాపుల రిజర్వేషన్లు అమలు చేయాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఏడాది ముందు కాపుల కోసం కమలం పార్టీ చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎంత మేరకు ఫలిస్తాయో చెప్పలేం కాని.. బీజేపీ మాత్రం కాపులను వదలడం లేదు. చూడాలి.. పవన్ + బీజేపీ కాంబినేషన్ ఇలాగే ఉంటే కాపులందరూ ఏకమయి తమకు అండగా నిలబడతారన్నది ఎంత వరకూ అన్నది.
Next Story