Mon Dec 23 2024 15:33:07 GMT+0000 (Coordinated Universal Time)
నాటి రోజులు కావమ్మా...!
రేణుక చౌదరి సీనియర్ నేత. అందులో సందేహం లేదు. అదే సమయంలో ఇప్పటి రాజకీయాలకు రేణుక చౌదరి పెద్దగా పనికి రారు
రేణుక చౌదరి సీనియర్ నేత. అందులో సందేహం లేదు. అదే సమయంలో ఇప్పటి రాజకీయాలకు రేణుక చౌదరి పెద్దగా పనికి రారు. ఎన్టీఆర్ జమానా కాదు. తెలుగుదేశం పార్టీ పుట్టిన కొత్తల్లో రేణుకను ఫైర్ బ్రాండ్‌గా చూసేవారు. కాని రాను రాను రాజకీయాలు మారిపోయాయి. ప్రజల్లో చైతన్యం పెరిగింది. మహిళలు ఎక్కువ మంది రాజకీయాల్లోకి వచ్చి రాణిస్తున్నారు. ఎలాంటి వివాదాలు లేకుండా, వాగ్వాదాలకు తావివ్వకుండా ఎదిగిన మహిళలు అన్ని పార్టీల్లో ఉన్నారు. ప్రజలు ఆ తరహా రాజకీయ నేతలను మాత్రమే ఆశీర్వదిస్తున్నారు. అభినందిస్తున్నారు. రేణుక చౌదరి ఇప్పుడు అవుట్ డేటెడ్ నేతగానే చెప్పుకోవాలి. ఖమ్మం జిల్లాలో ఒక సామాన్య నేతగానే చూడాలి తప్ప ఆమెను రాష్ట్ర స్థాయి నేతగా కూడా చూడకూడదని కాంగ్రెస్ నేతలే అంటారు.
ఎన్నికలకు ముందు....
దీనికి కారణాలు లేకపోలేదు. అధికారంలో ఉన్నప్పుడు హస్తినలో హల్ చల్ చేయడం, సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడం రేణుకకు అలవాటు. అలాగే ఢిల్లీలోనే తన రాజకీయం అన్నట్లు ఆమె వ్యవహరిస్తున్న తీరును కూడా స్థానిక నేతలు ఎవరూ అంగీకరించర. ప్రతి సారీ ఎన్నికలకు ముందు వచ్చి హడావిడి చేసే రేణుకను పార్టీ క్యాడర్ కూడా విశ్వసించడం లేదంటారు. ఆమెను సొంత పార్టీ నేతలే దగ్గరకు తీయరు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతోనూ ఆమెకు పొసగదు. పార్టీ కార్యక్రమాల్లో తనకు ఇష్టమైతేనే పాల్గొంటారు. లేదంటే లేదు. ఆమెను వీరు పిలవరు. పిలవకపోయినా వచ్చి కొంత గందరగోళం సృష్టిస్తుండటం ఆమెకు కొత్తేమీ కాదు. ప్రజలతో పెద్దగా సంబంధాలు లేని నేతగానే కాంగ్రెస్ నేతలు ఆమెను పరిగణిస్తారు.
పొంగులేటి రాకను...
తాజాగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీలోకి వస్తామంటే రేణుక చౌదరి అభ్యంతరం చెప్పడం కూడా కొందరికి సుతారమూ ఇష్టంగా లేదు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకున్నప్పుడు పొంగులేటి కాదు.. ప్రత్యర్థి ఎవరినైనా బలవంతుడైతే ఆహ్వానించి పార్టీని అధికారంలోకి తీసుకు రావాలన్న ఆకాంక్ష ఉండాలి. అప్పుడే నిజమైన పార్టీ లీడర్ గా గుర్తింపు పొందుతారు. కానీ రేణుక ఇప్పుడు పొంగులేటిని వ్యతిరేకించడం వెనక చాలా కారణాలున్నాయంటున్నారు. పొంగులేటి పార్టీలో చేరితే ఎంపీ టిక్కెట్ తనకు దక్కదు. అందుకే ఆయనకు అన్ని సీట్లు ఇవ్వడానికి పార్టీ నేతలు ఎవరు? ఇచ్చేదెవరు? తీసుకునేదెవరు? అని ప్రశ్నిస్తున్నారు. మీడియా ముందుకు వచ్చి మండి పడుతున్నారు. అయితే రేణుక అభ్యంతరం చెప్పినంత మాత్రాన పొంగులేటిని తీసుకోవాలంటే అది ఆగేది కాదన్న సంగతి ఆమెకూ తెలియంది కాదు.
కాంగ్రెస్ మారినా...
కాకుంటే తనకున్న పరిచయాలతో ఢిల్లీలో కొంత ఇబ్బందులు కలిగించే ఛాన్స్ అయితే ఉందన్నది గాంధీభవన్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. తన మూడు మారిందంటే మాడు పగలకొడతానంతే నంటూ రేణుక చేస్తున్న కామెంట్స్ ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌లో కాక పుట్టిస్తున్నాయి. రేణుక చౌదరికి ఒక ప్రత్యేక ఓటు బ్యాంకు అంటూ ఏమీ లేదు. కాంగ్రెస్ ఖమ్మం జిల్లాలో బలంగా ఉండబట్టే ఆమె ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారనేవారు కూడా లేకపోలేదు. పొంగులేటిని అడ్డుకున్నంత మాత్రాన పార్టీకి నష్టం. రేణుకకు ఎలాంటి నష్టం లేదని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించడం ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి. గతంలో మాదిరి తన హవా నడుస్తుందన్న భ్రమలో రేణుక ఉండిపోయారు. కానీ కాలం మారింది. కాంగ్రెస్ మారింది. రేణుక మాత్రం మారలేదు.
Next Story