Thu Dec 19 2024 11:47:45 GMT+0000 (Coordinated Universal Time)
రేణుక ప్రయత్నాలు వృధాయేనా?
స్తుతం కాంగ్రెస్ లో ఉన్న రేణుక చౌదరి తిరిగి యాక్టివ్ అయ్యారు. ఖమ్మంపై ఆమె ఫోకస్ పెంచారు.
ఒకప్పుడు ఫైర్ బ్రాండ్. పార్టీలో ఆమె ఉంటే జోష్ పెరుగుతుందని భావించేవారు. ఎన్టీఆర్ సయితం ఆమెలో ఉన్న ఫైర్ ను గుర్తించి పదవులను కట్టబెట్టారు. ఆమె రేణుకా చౌదరి. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న రేణుక చౌదరి తిరిగి యాక్టివ్ అయ్యారు. ఖమ్మంపై ఆమె ఫోకస్ పెంచారు. అయితే ఎన్నికలకు ముందే రేణుక చౌదరి జనాల్లోకి వస్తుండటం చర్చనీయాంశమైంది. అయితే ఆమె రాకను పార్టీ క్యాడర్ సయితం ఆహ్వానిస్తారా? ఆమెకు నేతలు సహకరిస్తారా? అన్నది చర్చనీయాంశంగా మారింది.
వ్యతిరేక వర్గమే....
రేణుక చౌదరి ఫైర్ బ్రాండ్ లీడర్. కానీ అది ఒకప్పుడు. ఆమెకు కాంగ్రెస్ లోనే ఒక గ్రూపు సహకరించే పరిస్థితి లేదు. గత లోక్ సభ ఎన్నికలకు సంబంధించి కూడా రేణుక చౌదరి ఎన్నికల ఫలితాల తర్వాత రచ్చ రచ్చ చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత మాయమైన రేణుక చౌదరి తిరిగి ఖమ్మంలో హల్ చల్ చేస్తున్నారు. రేణుక చౌదరిని ఖమ్మం జిల్లాలో వ్యతిరేకించే కాంగ్రెస్ నేతలే ఎక్కువగా ఉన్నారు.
హైకమాండ్ నే నమ్ముకుని....
రేణుక చౌదరి ప్రజలను నమ్ముకోలేదు. అలాగే క్యాడర్ ను ఆమె ఎప్పుడూ విశ్వసించలేదు. కేవలం హైకమాండ్ ను నమ్ముకున్నారు. హైకమాండ్ కు దగ్గరగా ఉండటంతో ఆమె పీీసీసీ నాయకత్వాన్ని కూడా ఎప్పుడూ లెక్క చేయలేదు. వచ్చే ఎన్నికల్లో తిరిగి ఖమ్మం పార్లమెంటు నుంచి పోటీ చేయాలని ఆమె భావిస్తున్నారు. అందుకే గత కొద్దిరోజులుగా రేణుకా చౌదరి ఖమ్మం ప్రాంతంలో పర్యటనలు ప్రారంభించారు.
ప్రయత్నాలు ప్రారంభం....
అయితే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులకు రేణుక చౌదరి సరిపోరన్నది కాంగ్రెస్ నేతల అభిప్రాయం. ఆమెను తిరిగి అభ్యర్థిగా ఎంపిక చేస్తే మరోసారి వర్గ విభేదాలు బయటపడటం ఖాయమంటున్నారు. ఖమ్మంలో కొంత టీడీపీ ఓటు బ్యాంకు ఉంది. అందుకే రేణుక చౌదరి ఏపీలోని మూడు రాజధానుల అంశాన్ని కూడా వ్యతిరేకించారు. అమరావతి రైతులకు ఆమె సంఘీభావం ప్రకటించారు. ఇలా రేణుక చౌదరి తిరిగి పోటీ చేయడానికి అన్ని ప్రయత్నాలు మొదలు పెట్టారు. కానీ ఎన్నికల ముందు వచ్చే నేతలకు ఏ మాత్రం ప్రజలు, క్యాడర్ నుంచి ఆదరణ లభిస్తుందన్నది వేచి చూడాల్సి ఉంది.
Next Story