Fri Dec 20 2024 01:54:27 GMT+0000 (Coordinated Universal Time)
కన్నడ ఫలితం రిపీట్ అవుతుందా?
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మాత్రం ఒకటి స్పష్టం చేశాయి. ఎన్ని హామీలు ఇచ్చినా ఫలితం ఒక వైపు ఉండనుంది
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మాత్రం ఒకటి స్పష్టం చేశాయి. ఎన్ని హామీలు ఇచ్చినా సరే. ఎన్ని "షో"లు చేసినా సరే. ఎన్ని బహిరంగ సభలు నిర్వహించినా అంతే. కానీ ప్రజలు మాత్రం ముందుగానే డిసైడ్ అయిపోతారు. వాళ్లు ఒకసారి ఫిక్సయితే అంతే మరి. ఎన్ని ఫీట్లు చేసినా తలొగ్గరు. ఇప్పుడు అదే రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఏడాది తెలంగాణలోనూ, వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్‌లోనూ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ప్రజలు ప్రభుత్వాలపై అసంతృప్తి ఉంటే ఓట్ల రూపంలో వెళ్లగక్కుతారు. అంతే తప్ప అధికార పార్టీ ఎన్ని సర్కస్ ఫీట్లు చేసినా ఫలించవు. అలాగే ప్రభుత్వంపై సంతృప్తి ఉంటే ప్రతిపక్షాలు ఎన్ని కలసి వచ్చినా ఏం చేయలేవన్నది కర్ణాటక ఫలితాల ద్వారా స్పష్టమవుతుంది.
తొమ్మిదేళ్లు...
ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు గడుస్తుంది. సహజంగానే ప్రజల్లో అసంతృప్తి ఉంటుంది. ఏకపక్ష నిర్ణయాలు కూడా కొందరిని పార్టీకి దూరం చేస్తాయి. తాను అనుకున్నదే చేయాలనుకునే వారికి, ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తీసుకుని మంత్రి వర్గంలోకి తీసుకునే వారికి ఈ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారని విపక్షాలు బలంగా అభిప్రాయపడుతున్నాయి. అయితే తాము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రజలను మరోసారి అధికారాన్ని దక్కేలా చేస్తాయని అధికార బీఆర్ఎస్ బలంగా విశ్వసిస్తుంది. అయితే అధికారంలో ఉన్న పార్టీకి ఎక్కడో ఒక మూల శంక ఉంటుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసంతృప్తి కొంప ముంచుతుందేమోనన్న భయం మాత్రం ఉంటుంది.
ఏపీలోనూ అంతే...
ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూడా దాదాపు అంతే. సంక్షేమ పథకాల ద్వారానే తాను మరోసారి అధికారంలోకి రాగలనని జగన్ భావిస్తున్నారు. విపక్షాలన్నీ ఏకమై జగన్ ఓడించేందుకు సిద్ధమవుతున్నాయి. వ్యతిరేక ఓటు చీల కూడదన్న ఏకైక అభిప్రాయంతో బీజేపీ, టీడీపీ, జనసేన ఒక్కటి కాబోతున్నాయి. అయితే వ్యతిరేక ఓటు చీల్చకపోయినా జగన్ వైపు జనం మొగ్గు చూపితే ఎవరూ ఆపలేరు. అలాగే అసంతృప్తి క్షేత్రస్థాయిలో బలంగా ఉంటే మాత్రం విపక్షాలను అధికారంలోకి రాకుండా ఎవరూ అడ్డుకోలేరు. కర్ణాటకలో జరిగిన ఎన్నికల తీరుతో ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు ఆలోచనలో పడ్డాయి.
కులాల వారీగా...
ఇందుకు కొంత కసరత్తు చేయాల్సి ఉంది. 1. తాము ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మేలా చేయడం. 2. కులాల వారీగా ఓట్లను సంపాదించుకోవడం. కర్ణాటకలో లింగాయత్, ఒక్కలిగలు ఇద్దరూ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతోనే అక్కడ 136 స్థానాలు వచ్చాయి. ఇక్కడ కూడా కాపులు, బీసీలు అధికంగా ఎటువైపు ఉంటారో వారిదే విజయం అన్న లెక్కలు రాజకీయ నేతలను భయపెడుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ ఎలక్షనీరింగ్‌లో ఎవరిది పై చేయి అయితే అటు వైపు మొగ్గు చూపుతారని పార్టీలు అభిప్రాయపడున్నాయి. అందుకోసమే... కన్నడ ఫలితాలు ఏపీ, తెలంగాణలోనూ రిపీట్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. ఒకే పార్టీకి అత్యధిక స్థానాలు దక్కే అవకాశముందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. విశ్లేషణలు కనిపిస్తున్నాయి.
Next Story