ముగ్గురూ రండీ... కొడంగల్ చౌరస్తాలో తేల్చుకుందాం
ఇవాళ తనపై పోలీసులతో కేసీఆర్ చేయించిన దాడి 2 లక్షల మంది కొడంగల్ ప్రజలపై జరిగిన దాడిగా ప్రజలు భావిస్తున్నారని, వారే ఈ దాడిని తిప్పికొడతారని పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన విడులయ్యాక కొడంగల్ లో మీడియాతో మాట్లాడుతూ... కొడంగల్ లో కేసీఆర్ అక్రమాలు, నిర్భందాలు, డబ్బుల మూటలతో కొడంగల్ ప్రజలపై యుద్ధం ప్రకటించారని పేర్కొన్నారు. ఎంపీగా ఐదేళ్లు, సీఎంగా నాలుగున్నరేళ్లు ఉన్న కేసీఆర్ ఒక్క రోజు కూడా కేసీఆర్ కొడంగల్ ప్రజల వైపు కన్నెత్తి చూడలేదన్నారు. కొడంగల్ ప్రజల అభిమానాన్ని కొనుక్కోవడానికి కేసీఆర్ ఇప్పటికే రూ.200 కోట్లు ఖర్చు పెట్టినా అనుకున్నది జరగనందున అక్రమాలు, కుట్రలకు తెరలేపారని ఆరోపించారు. హరీష్ రావు రెండు రోజులుగా ఇక్కడే ఉండి పోలీసుల అండతో పోలీసుల వాహనాలలోనే డబ్బు పంపిణీ చేస్తున్నారు. ముందస్తు ఎన్నికలు, ముందస్తు అరెస్టుల ద్వారా కేసీఆర్ ముందస్తుగానే ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు. పోలీసుల రక్షణతో కేసీఆర్ కొడంగల్ లో పర్యటించి మొనగాడు అనుకుంటున్నాడని, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురు కలిసిరావాలని, ముఠాలను, మూటలను కూడా తీసుకురావాలని కొడంగల్ చౌరస్తాలోనే తెల్చుకుందామని సవాల్ చేశారు.