రేవంత్‌రెడ్డికి ప్రభుత్వం షాకిచ్చిందా..?
కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపి రేవంత్ రెడ్డికి తెలంగాణ సర్కార్ ప్రభుత్వం షాకిచ్చిందా..? అంటే అవునా.. కాదా అన్నట్లుగా ఉంది. రేవంత్‌రెడ్డికి సెక్యూరిటీని ప్రభుత్వం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిన్నటి నుంచి రేవంత్‌రెడ్డి గన్మెన్లు లేకుండానే తిరుగుతున్నారు. అయితే ఇటీవల రేవంత్ పోలీసులపై చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై నిరసనగా సెక్యూరిటీ విధులకు డుమ్మా కొట్టినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఇటీవల 4+4 ఉన్న సెక్యూరిటీని 2+2కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఇప్పుడు భద్రతను 1+1 కు చేరింది. రేవంత్ భద్రత కుదింపు విషయంలో రేవంత్‌రెడ్డి విస్మయానికి గురయ్యారు. ఈ అంశం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. రెండు నెలల క్రితం తనకు భద్రత కల్పించాలని కోర్టులో పిటిషన్ వేశారు రేవంత్ రెడ్డి. కోర్టు నుంచి ఎలాంటి ఉత్తర్వు రాకముందే ప్రభుత్వం ఇలా చేయడం దారుణమంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఉన్న 1+1 సెక్యూరిటీ కూడా వద్దని ఈరోజు తిరిగి ఉదయం నుంచి సెక్యూరిటీ లేకుండానే రేవంత్ రెడ్డి తిరుగుతున్నారు.
ఎలాంటి కారణాలు చూపకుండానే గన మెన్లను తొలగించడంతో కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో భద్రత పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి కూడా అనేక విజ్ఞప్తులు చేశారు. కానీ కేంద్ర సర్కార్ సానుకూలంగా స్పందించలేదు. అయితే సెక్యూరిటీ సిబ్బందికి రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పేవారు విధుల్లో చేరవద్దని భద్రత సిబ్బంది నిర్ణయించుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.అయితే ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. అయితే రేవంత్‌రెడ్డిని నిజంగానే ప్రభుత్వం భద్రతను తగ్గించిందా..? లేక రేవంత్‌రెడ్డి వ్యాఖ్యల కారణంగానే భద్రత సిబ్బంది విధులకు డుమ్మా కొట్టారా..? అనేది మరింత క్లారిటీ రావాల్సి ఉంది.