రేవంత్ గుట్టు మొత్తం విప్పారే....!
తనపై విచారణ చేసినా, కేసులు పెట్టినా, అండమాన్ జైళ్లో బంధించినా కేసీఆర్ అవినీతి, అహంకారం, పెత్తందారీతనం, బందుప్రీతి, కులపిచ్చిపై పోరాటం కొనసాగిస్తానని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎనుముల రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తన ఆస్తులపై సిట్టింగ్ జడ్జి విచారణకు సిద్ధంగా ఉన్నాని, కేసీఆర్ ఆస్తులపై విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు. తన నివాసంలో ఐటీ సోదాల నేపథ్యంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ...
- మూడు నాలుగు రోజులుగా రాజకీయ ప్రత్యర్థి అయిన కేసీఆర్ అనుచర బృందం, నిష్పక్షపాతంగా ఉండాల్సిన మీడియా రకరకాల విషయాలను నాపైన ప్రచారం చేశారు.
- గత కొన్ని రోజులుగా జగ్గారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, కూన శ్రీశైలం గౌడ్ పై కేసులతో వేదించినట్లే ఇప్పుడు నన్నూ వేధించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే కేసీఆర్ ప్రగతి భవన్ లో భయంభయంగా ఎలా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారో అర్థమవుతోంది.
- 2007లో శాసనమండలికి ఎన్నికైనప్పుడు, 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు ఆస్తులు ప్రకటించింది రిజిస్ట్రేషన్ వాల్యూని మాత్రమే అఫిడవిట్ లో చూపించాను. కానీ, 2014లో మార్కెట్ వాల్యూ అఫిడవిట్ లో చెప్పాలని ఎన్నికల సంఘం చెప్పడంతో మార్కెట్ వాల్యూను చూపించాను. దీంతో ఆస్తుల విలువ పెరిగినట్లు కనపడుతోంది.
- 2009లో ప్రస్తావించిన ఆస్తుల వివరాలను 2014లోని ఆస్తుల వివరాలను పోల్చి చూడండి. ఏవైనా కొత్తగా చేరాయా చూసుకోవచ్చు. స్వంత గ్రామంలో 10 ఎకరాల స్థలం తప్ప 2009 తర్వాత కొత్తగా ఏ ఒక్క ఆస్తి కూడా కొనుగోలు చేయలేదు.
- ఇంటి అడ్రస్ పై కంపెనీలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. మాది నాలుగు అంతస్తుల భవనం. 22 ఏళ్లుగా భవనాన్ని అనేక కార్యాలయాలకు అద్దెకు ఇచ్చాం. అద్దెకు తీసుకున్న వారు ఈ అడ్రస్ పైనే కంపెనీలను ప్రారంభించుకున్నారు. నా ఇంటి అడ్రస్ ఉంటే నేనే స్థాపించినట్లా..?
- నాకు పిల్లను ఇచ్చిన మామ తండ్రి 50 ఏళ్ల కిందే కోటీశ్వరుడా..? కాదా..? విచారించండి. హైదరాబాద్ లో, గ్రామాల్లో వందల ఎకరాల భూములు ఉండేవా.? లేవా.? కనుక్కోవాలి. అటువంటి కుటుంబసభ్యులు నా బినామీ అనడం ఎంత బుద్ధి తక్కువ పనో అర్థం చేసుకోండి.
- ఎవరో రౌడీషీటర్.. అతనిపై పెట్టబోయే పీడీ యాక్టును తప్పించుకోవడానికి కేటీఆర్ ను కలిస్తే.. కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్న నాపై కేసులు వేసే పనిని అప్పగించారు.
- హాంకాంగ్ లో ఖాతా తెరవాలంటే ఆ దేశ పౌరుడు అయ్యి ఉండాలి. లేదా అక్కడే స్థిరపడి ఉండాలి. ఈ విషయాన్ని కూడా మీడియా తెలుసుకోలేకపోయింది. 2014 తర్వాత ఈ ఖాతాలు తెరిచానని అంటున్నారు. 2013 తర్వాత ఆ దేశానికి నేను వెళ్లినట్లు రుజువు చేస్తారా అని ముఖ్యమంత్రికి సవాల్ చేస్తున్నాను.
- 20 కోట్లకు ఆరోపణలు ఉంటే 1000 కోట్లు ఉన్నాయని ఓ పత్రిక రాయడం ధౌర్భాగ్యం.
- కేసీఆర్ ను సంతోష పెట్టడానికి దూకుడులో బ్రహ్మానందంలా నటించినట్లు... టీవీల్లో చర్చలు పెట్టిన పాత్రికేయులు నటిస్తున్నారు. చారాణా తీసుకుని బారాణా నటిస్తున్నారు. నన్ను, నా కుటుంబ పరువు తీయాలని చూస్తే ఎట్టి పరిస్థితిలో సహించేది లేదు.
- నేను నిజంగానే డబ్బుకు ఆశపెడేవాడినే అయితే 2009లో, 2014లో జరిగిన ఆపరేషన్ ఆకర్ష్ లో అధికార పార్టీల్లో వెళ్లేవాడిని కాదా..?
- కేసీఆర్ అబద్ధాలపై అసెంబ్లీలో నేను మాట్లాడితే... నాపై ఆపరేషన్ బ్లూస్టార్ చేస్తానని కేసీఆర్ బెదిరించారు.
- మైహోం రామేశ్వరరావు అక్రమాలు, ప్రాజెక్టుల రీడిజైన్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ విషయంలో నేను అసెంబ్లీలో మాట్లాడకుండా ప్రతీ శాసనసభ నుంచి నన్ను బయటకు పంపించిన మాట వాస్తవం కాదా..?
- రాష్ట్రంలో ప్రతీ ఊరు తిరిగి కేసీఆర్ చేసిన అవినీతి, అక్రమాల గురించి ప్రజలకు వివరిస్తా.