Thu Nov 28 2024 22:28:53 GMT+0000 (Coordinated Universal Time)
మరో ఐదేళ్లు గాంధీభవన్ లో గోళ్లు గిల్లుకోవాల్సిందే
తెలంగాణ కాంగ్రెస్ లో సరికొత్త జోష్ నింపేందుకు రేవంత్ రెడ్డి పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ లో సరికొత్త జోష్ నింపేందుకు రేవంత్ రెడ్డి పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. వచ్చే నెల 26వ తేదీ నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ పాదయాత్రకు ఇప్పటికే యాత్ర అని పేరు పెట్టారు. పాదయాత్రతో నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు యాత్ర కొనసాగించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. యాత్రను జూన్ 2వ తేదీన ముగించేలా రూట్ మ్యాప్ ను రూపొందిస్తున్నారు. దాదాపు నాలుగు నెలల పాటు పాదయాత్ర చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఎక్కడి నుంచి మొదలయ్యేది.. ఎక్కడ ఎండ్ అవుతుందన్నది త్వరలోనే పార్టీ నేతలు ప్రకటించనున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో...
అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో యాత్ర అవసరమని అందరూ భావిస్తున్నారు. హైకమాండ్ కూడా అందుకోసమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2004కు ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హైకమాండ్ అనుమతితోనే అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ను అధికారంలోకి తేగలిగారు. ఇప్పుడు అదే తరహాలో రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ కు పదేళ్ల తర్వాత ఊపిరిలూదాలన్న ప్రయత్నాలను తన పాదయాత్ర ద్వారా చేయనున్నారు. వచ్చే ఏడాది నవంబరు, డిసెంబరు నెలల్లో తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈలోపు జూన్ లో ముగించగలిగితే అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటు, మిత్రపక్షాల ఏర్పాటు వంటివి పీసీసీ చీఫ్ గా చూసుకోవచ్చన్న ఉద్దేశ్యంతో రేవంత్ రెడ్డి ఉన్నారు. దాదాపు 70 నుంచి 80 నియోజకవర్గాలు కవర్ చేసేలా పాదయాత్ర రూట్ ను సిద్ధం చేస్తున్నారు.
బీజేపీని వెనక్కు నెట్టేయాలంటే...
ఇప్పటికే అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జులు, జిల్లా పార్టీ అధ్యక్షులకు ఆదేశాలు వెళ్లినట్లు తెలిసింది. రేవంత్ యాత్రను సక్సెస్ చేయడానికి సహకరించేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని రేవంత్ స్వయంగా కోరినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం బీజేపీ మిషన్ 90 పేరుతో జనవరి నుంచే కార్యక్రమాలను ప్రారంభిస్తుంది. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా తామేనని చెప్పుకుంటూ పోతుంది. అయితే రేవంత్ స్వతహాగా మాటకారి. పాదయాత్రలో వీలయినన్ని ఎక్కువ ప్రాంతంలో మీటింగ్ లు పెట్టి ప్రజలను కాంగ్రెస్ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తారంటున్నారు. అధికార టీఆర్ఎస్ పై ప్రజల్లో అసంతృప్తి ఉందని, అదే సమయంలో కాంగ్రెస్ నేతలపై నమ్మకం లేదన్న ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ నుంచి గెలిపించినా బీఆర్ఎస్ లోకి వెళతారన్న భావనలో ప్రజలు ఉన్నారు.
ఆ నమ్మకం కలిగిస్తే....
అయితే రేవంత్ రెడ్డి ప్రజలకు భరోసా ఇవ్వడానికి ఈ యాత్ర ఉపయోగపడుతుందని చెబుతున్నారు. కాంగ్రెస్ టిక్కెట్ పై గెలిచిన వారినెవరైనా ఇక బీఆర్ఎస్ లోకి వెళ్లరన్న హామీని ప్రజలకు ఇవ్వనున్నారు. పార్టీ పట్ల అంకిత భావంతో ఉన్న వారికే టిక్కెట్లు కేటాయిస్తామని కూడా ఈ యాత్ర ద్వారా జనంలోకి రేవంత్ బలంగా తీసుకెళతారని అంటున్నారు. ఆ నమ్మకం ప్రజల్లో కలిగించగలిగితే తెలంగాణలో అధికారంలోకి రావడం కాంగ్రెస్ కు పెద్ద కష్టమేమీ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే సీనియర్ నేతలు ఈ యాత్రకు సహకరించాల్సి ఉంటుంది. పార్టీని అధికారంలోకి తెచ్చే వారికి ఎవరికైనా సహకరిస్తేనే తమకూ రాజకీయ భవిష్యత్ ఉంటుందని సీనియర్లు గుర్తించాలి. లేకుంటే మరో ఐదేళ్లు గాంధీ భవన్ లో గోళ్లుగిల్లుకుంటూ కాలం వెళ్లబుచ్చాల్సిందేనని మర్చిపోకండన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
Next Story