రేవంత్ ఇలాఖాలో... టీఆర్ఎస్ జెండా ఎగరేనా..?
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయమైపోయాయి. మళ్లీ విజయబావుటా ఎగరవేసేందుకు గులాబీ దళపతి వ్యూహాలకు పదును పెడుతున్నారు. అసెంబ్లీ రద్దు చేసిన గంటలోపే 105 మంది అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్షాలకు అందనంత వేగంగా దూసుకుపోతున్నారు. ఇప్పటికే ప్రకటించిన అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రచారాన్ని కూడా ప్రారంభించేశారు. అయితే, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రముఖులను పక్కాగా టార్గట్ చేశారు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ నేతలుగా ఉంటూ, టీఆర్ఎస్ పై దూకుడుగా వ్యవహరించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వవద్దని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ ముఖ్య నేతలపై బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నారు. ముఖ్యంగా మైక్ దొరికితే చాలు టీఆర్ఎస్ పై, కేసీఆర్, కేసీఆర్ కుటుంబంపై విరుచుకుపడే కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి స్వంత నియోజకవర్గంలోనే చెక్ పెట్టి కోలుకోలేని దెబ్బ తీయాలని టీఆర్ఎస్ భావిస్తోంది.
మారిపోయిన సమీకరణలు...
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం నుంచి 2009, 2014 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరుపున ఎన్నికయ్యారు. యువకుడు కావడం, చొచ్చుకుపోయే స్వభావం కలిగి ఉండటంతో రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో స్వంతంగా బలం సంపాదించుకున్నారు. దీంతో పాటు అంతకుముందు ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గురునాధ్ రెడ్డిపై సహజంగా ఏర్పడే వ్యతిరేకత వల్ల కూడా కొడంగల్ ప్రజలు రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపడానికి కారణం. గత ఎన్నికల్లో ఆయన గురునాధ్ రెడ్డి పైన 14 వేల మేజారిటీతో విజయం సాధించారు. కాంగ్రెస్ ఇక్కడ మూడో స్థానానికే పరిమితమైంది. అయితే, కొన్నాళ్లకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడంతో ఇక్కడ ఈక్వేషన్స్ అన్నీ మారిపోయాయి.
సంవత్సరం నుంచి ప్రత్యేక దృష్టి...
రేవంత్ రెడ్డి తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ లో చేరిన సమయంలో ఉపఎన్నికలు వస్తాయని టీఆర్ఎస్ అంచనా వేసింది. దీంతో అప్పటినుంచే ఆ పార్టీ పెద్దలు కొడంగల్ నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ బాధ్యతలను పార్టీలో ముఖ్యనేత హరీష్ రావుపై పెట్టింది. సీనియర్ నేత గురునాధ్ రెడ్డి టీఆర్ఎస్ లోనే ఉన్నా... ఆయన వయస్సురిత్యా రేవంత్ రెడ్డికి బలమైన పోటీ ఇవ్వలేరనే ఉద్దేశ్యంతో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సోదరుడు, ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డిని బరిలోకి దింపాలని భావించింది. దీంతో గత సంవత్సర కాలం నుంచి నరేందర్ రెడ్డి కొడంగల్ లో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మొన్న కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో అనుకున్నట్లుగానే కొడంగల్ నియోజకవర్గానికి నరేందర్ రెడ్డి పేరును ఖరారు చేశారు.
నేను లోకల్ అంటున్న రేవంత్...
దీంతో ఈసారి రేవంత్ రెడ్డి - నరేందర్ రెడ్డి మద్య పోరు రసవత్తరంగా ఉండనుంది. నరేందర్ రెడ్డి ఆర్థికంగా బలవంతుడు కావడం, గత సంవత్సర కాలంగా నియోజకవర్గంలో టీఆర్ఎస్ పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేస్తుండటం టీఆర్ఎస్ కు కలిసి వచ్చే అవకాశం ఉంది. అయితే, గురునాథ్ రెడ్డి వర్గం ఎంతమేర సహకరిస్తుందనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఇక టీఆర్ఎస్ కు తగ్గట్లుగా రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ బలం ఇంకా పెంచుకునే ప్రయత్నం చేశారు. నరేందర్ రెడ్డి నాన్ లోకల్ అంటూ స్థానికత అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి స్వస్థలం కూడా కొడంగల్ కాకున్నా తనది అక్కడి ప్రజలు మాత్రం అలా భావించడం లేదు. పైగా తన కట్టె కాలేది కూడా కొడంగల్ లోనే అని రేవంత్ పదే పదే చెబుతారు. ఇక టీఆర్ఎస్ కు కొడంగల్ పై ప్రేమ లేదని, కేవలం తనను ఓడించేందుకే పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. అవకాశం దొరికినప్పుడల్లా బలప్రదర్శనలు చేయడం ద్వారా తనకు తిరుగులేదనే ఒక భావనను నెలకొల్పారు. ఇక రేవంత్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా పనిచేస్తున్నందున ‘మనవాడే’ అన్న భావన సహజంగానే నియోజకవర్గ ప్రజల్లో ఉంది. దీంతో రెండు పార్టీలూ చెబుతున్నట్లు భారీ మెజారిటీ ఎవరికీ వచ్చే అవకశాం అయితే ఇక్కడ కనపడటం లేదు. ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉండబోతోంది. ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీతోనే గెలిచే అవకాశం ఉంది. మొత్తానికి ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలని రేవంత్ రెడ్డి కలలు కంటుండగా, కొడంగల్ లో జెండా ఎగరేసి రేవంత్ రెడ్డిని దెబ్బకొట్టాలని టీఆర్ఎస్ భావిస్తోంది. మరి ఎవరి పంతం నెరవేరుతుందో చూడాలి.