Mon Dec 23 2024 18:59:27 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్-ప్రశాంత్ కిషోర్ భేటీపై స్పందించిన రేవంత్ రెడ్డి
ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరగానే తనతో కలిసి సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహిస్తారని, టీఆర్ఎస్ ను ఓడించాలని..
హైదరాబాద్ : ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ గత రెండ్రోజులుగా హైదరాబాద్ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో చర్చలు జరుపుతున్నారంటూ కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలపై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. టీఆర్ఎస్ తో ఒప్పందం తెగదెంపులు చేసుకోవడానికే ప్రశాంత్ కిశోర్ సీఎం కేసీఆర్ ను కలిశారని రేవంత్ రెడ్డి అన్నారు. ఇకపై టీఆర్ఎస్ కు, ప్రశాంత్ కిశోర్ కు చెందిన ఐప్యాక్ సంస్థకు సంబంధాలు తెగిపోయినట్టేనని, ప్రశాంత్ కిశోర్ విషయంలో మేం ముందు నుంచి చెప్పిందే ఇప్పుడు జరిగిందని రేవంత్ స్పష్టం చేశారు.
ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరగానే తనతో కలిసి సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహిస్తారని, టీఆర్ఎస్ ను ఓడించాలని ఆయనే స్వయంగా పిలుపునిస్తారని తెలిపారు. ఇక ప్రశాంత్ కిషోర్‌కు టీఆర్ఎస్కు ఎలాంటి సంబంధం ఉండదని.. ఐప్యాక్‌కు పీకేకు ఇక ఎలాంటి సంబంధం ఉండదని రేవంత్ రెడ్డి తెలిపారు. తాను ముందు నుంచి చెప్పిందే ఇప్పుడు జరిగిందని తెలిపారు. పీకే కాంగ్రెస్‌లో చేరాక తెలంగాణ రాష్ట్రానికి వచ్చి.. తనతో కలిసి ఉమ్మడి ప్రెస్‌మీట్ కూడా పెట్టే రోజు దగ్గరలోనే ఉందని తెలిపారు. ఆ రోజు పీకే స్వయంగా టీఆర్ఎస్ను ఓడించండని ఆయన నోటి నుంచి చెప్పడం మీరు వింటారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవడం ప్రాధాన్యతను సంతరించుకున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపు ఖరారవడంతో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీతో ఎలా వ్యవహరిస్తారనే చర్చ కూడా జరుగుతోంది. కొన్ని షరతులకు ఒప్పుకుంటేనే కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానమని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తేల్చిచెప్పినట్లు ప్రచారం సాగుతోంది. ఇదివరకే ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్, అటు ఏపీ సీఎం వైఎస్ జగన్ కోసం ఆయన పనిచేస్తారా? లేదా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది.
Next Story