నన్ను చంపాలని చూస్తున్నారు
కేసీఆర్ ప్రభుత్వం తనను చంపడానికి ప్రయత్నిస్తోందని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ ఎనుముల రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కొడంగల్ టీఆర్ఎస్ అభ్యర్థి నాలుగు నెలలుగా ఉంటున్న ఇంట్లో ఐటీ దాడుల్లో రూ.17 కోట్ల 51 లక్షలు దొరికాయని, మరో 50 కోట్లు ఖర్చుచేసిన లెక్కలు ఉన్న డైరీగా లభ్యమైందని ఆయన ఆరోపించారు. అర్థరాత్రి అలెర్ట్ అయిన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, పీఎం కార్యాలయం నుంచి ఐటీ అధికారులపై ఒత్తిడి తెచ్చి కేవలం 51 లక్షలు మాత్రమే దొరికినట్లు చెబుతున్నారని ఆరోపించారు.
నిపుణులను రంగంలోకి దించారు
తనకు కేంద్ర బలగాలతో సెక్యూరిటీ కల్పించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినా అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. తనపై దాడి చేయించేందుకు, అవసరమైతే హత్య చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోంది. నక్సల్స్ ఏరివేతలో నిపుణులైన పోలీసులు మఫ్టీలో దాడికి దిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. తాను ఐటీ, ఈడీ దాడులు, పార్టీ ఫిరాయింపులపై చెప్పింది నిజమైందని, తనపై దాడి కూడా జరుగుతుందని ఆయన అనుమానించారు. తనకు వెంటనే కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు.