రాహుల్ సభలో ఆకట్టుకున్న రేవంత్ స్పీచ్
సరూర్ నగర్ లో జరిగిన కాంగ్రెస్ నిరుద్యోగ - విద్యార్థి గర్జనలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి స్పీచ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆయన కేసీఆర్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ...‘‘ ఇవాళ ఇక్కడి ప్రజలను చూస్తుంటే గండిపేట తెగి గల్లీల్లోకి వచ్చినట్లుంది. కేసీఆర్ చాలా..! ఇంకా కావాలా..! ఇంకా కావాలంటే సింగరేణిలో గర్జిస్తాం... కాకతీయ కోటలో కదం తొక్కుతాం.. పరేడ్ గ్రౌండ్ లో వరదై పారుతాం. కాంగ్రెస్ ఈ దేశానికి ఏం చేసిందని కొందరు అడుగుతున్నారని, ఈ దేశంలో ప్రాజెక్టులు, డ్యామ్ లు కట్టింది కాంగ్రెస్. శత్రుదేశం పాకిస్తాన్ పై రెండుసార్లు యుద్ధం చేసి గెలిపించింది కాంగ్రెస్. ఆరు లక్షల గ్రామాలున్న దేశంలో మారుమూల తండాలు, గూడాలకు కరెంటు ఇచ్చింది కాంగ్రెస్. శ్రీశైలం, నాగార్జున సాగర్, కల్వకుర్తి, జూరాల, బీమా, శ్రీరాం సాగర్ ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్. ఇవాళ కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినందునే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు. తెలంగాణలో రైతులు, విద్యార్థులు, మైనారిటీలు, కార్మికులు కాంగ్రెస్ తోనే బాగుపడతారు. కండలు కరగని..గుండెలు పగలని.. రక్తం ఏరులై పారినా పోరాడి కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం’’ అని ఆయన పిలుపునిచ్చారు. రేవంత్ స్పీచ్ కు కార్యకర్తల నుంచి మంచి స్పందన వచ్చింది.