రేవంత్ ను ఎక్కడికి తీసుకెళ్లారు?
కాంగ్రెస్ సీనియర్ నేత రేవంత్ రెడ్డి అరెస్ట్ పై ఆయన భార్య గీత అభ్యంతరం వ్యక్తం చేశారు. అర్థరాత్రి ఇంట్లోకి చొరబడి తలుపులు పగలకొట్టి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముందని గీత ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ఇదేనా ప్రజాస్వామ్యం అని ఆమె నిలదీశారు. తమ ఆత్మగౌరవం మీద దెబ్బ కొడితే ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించారు. రేవంత్ ను ఎక్కడికి తీసుకెళుతున్నారో చెప్పలేదని, అరెస్ట్ చేస్తున్నప్పుడు దానికి కారణాలు కూడా చెప్పలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓటమి భయంతోనే టీఆర్ఎస్ ఈ దాడులకు పాల్పడుతుందన్నారు.
హైకోర్టును ఆశ్రయించాలని.....
మరోవైపు రేవంత్ రెడ్డి అక్రమ అరెస్ట్ పై కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయింది. ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ మరికొద్దిసేపట్లో రేవంత్ అక్రమ అరెస్ట్ పై ఫిర్యాదు చేయనున్నారు. అలాగే రేవంత్ రెడ్డి అరెస్ట్ పై కాంగ్రెస్ నేతలు హైకోర్టును ఆశ్రయించనున్నారు. ప్రచారానికి ఇంకా రెండు రోజులు మాత్రమే సమయం ఉండగా రేవంత్ ను అరెస్ట్ చేయడం వెనక కుట్ర దాగి ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.