Tue Nov 05 2024 07:50:09 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ కు ఇక ఎటు చూసినా కష్టాలేనట...!
తెలంగాణలో రాబడి తగ్గిపోయింది. సంక్షేమ పథకాలు ఎక్కువయ్యాయి. ఫలితంగా ఖాజానా బోసి పోయింది.
ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణకు ఏమాత్రం తేడా లేదు. దొందూ దొందే. కానీ ఏపీకి అప్పులు పుడుతున్నాయి. తెలంగాణకు మాత్రం అప్పులు కొరవడ్డాయి. అప్పుల కోసం కాళ్లు అరిగేలా తిరుగుతున్నా ఫలితం కన్పించడం లేదు. కారణం కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలే కారణమని చెప్పక తప్పదు. ప్రస్తుత ఆర్థిక అవసరాలకు సరిపడా కూడా ఖజానాలో డబ్బులు లేకపోవడం ఆందోళన కల్గిస్తుంది. ధనిక రాష్ట్రంగా పేర్కొనే తెలంగాణ ఇప్పడు ఢిల్లీలో మోకరిల్లుతుంది. చేతులు చాస్తుంది.
ఖజానా బోసిపోయి....
ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం, ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేయడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తెలంగాణలో రాబడి తగ్గిపోయింది. సంక్షేమ పథకాలు ఎక్కువయ్యాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ హామీలు ఎక్కువగా ఇవ్వడం, దుబారా ఖర్చు వంటివి ఖజానా బోసి పోయేలా చేసింది. పైగా కేంద్రంతో అధికార టీఆర్ఎస్ పార్టీ కయ్యం కలసి రాలేదు. అప్పులు చేయాలంటే కొర్రీలు పెడుతుండటంతో ఆర్థిక శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు.
నెల గడవాలంటే...
జూన్ నెల గడవాలంటే 20 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి తక్షణ అవసరం. కానీ అన్ని చిల్లి గవ్వ లేదు. రాబడి కూడా తగ్గిపోయింది. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం అధికారులు పడిగాపులు కాస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో వైరంతో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు. వివిధ రాష్ట్రాలను పర్యటిస్తున్నారు. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలకు కూడా ఆయన దూరంగా ఉన్నారు. ప్రధాని మోదీ ఇప్పటి వరకూ మూడు సార్లు తెలంగాణకు వస్తే కేసీఆర్ డుమ్మా కొట్టడం కూడా కమలనాధుల ఆగ్రహానికి కారణాలుగా చెబుతున్నారు.
ఆర్థిక మూలాలపై....?
అందుకే తెలంగాణ ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్థికంగా తెలంగాణలో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడితే సంక్షేమ పథకాలు అమలుకు నోచుకోవు. ఫలితంగా ప్రభుత్వం బద్నాం అవుతుంది. బీజేపీకి కావాల్సిందదే. దళిత బంధు పథకాన్ని కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రకటించారు. అందుకు వేల కోట్ల నిధులు అవసరమవుతాయి. ఎన్నికలు జరిగే లోపు అన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లోనైనా ఈ పథకాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. ఈ పథకానికి అవసరమైన నిధులను కేసీఆర్ ఎక్కడి నుంచి తెస్తారన్న ప్రశ్న సొంత పార్టీ నేతల నుంచే ఎదురవుతుంది.
పన్నులు వేయలేక...
మరోవైపు ప్రజలపై పన్నుల భారం మోపలేరు. దాదాపు ఎన్నికల సంవత్సరం కావడంతో ప్రజలపై ఎలాంటి పన్నులు వేసినా ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇప్పటికే 8 ఏళ్ల పాలనపై కొన్ని వర్గాల్లో అసంతృప్తి ఉంది. పన్నులు మోపితే సాధారణ ప్రజలు కూడా పార్టీకి దూరం అవుతారు. అప్పుడు అసలుకే ఎసరు వస్తుంది. వివిధ రూపాల్లో అప్పులు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం వైఖరిపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తుంది. మొత్తం మీద కేసీఆర్ మోదీని గద్దె దించడానికి రాష్ట్రాలు తిరుగుతుంటే, ఢిల్లీ నుంచే మోదీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కట్టడి చేయాలని చూస్తున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఏది ఏమైనా తెలంగాణ మాత్రం ఆంధ్ర కంటే ఆర్థికంగా మరింత ఇబ్బందులు పడక తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Next Story