Fri Nov 22 2024 19:01:56 GMT+0000 (Coordinated Universal Time)
రాబిన్ శర్మా.. ఇదేమి ఖర్మ?
టీడీపీకి రాబిన్ శర్మ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో అనేక ప్రోగ్రాంలు రూపుదిద్దుకుంటున్నాయి.
గతంలో ఎన్నడూ జరిగిన ఘటన కందుకూరు ఘటన. రాజకీయ పార్టీల అగ్రనేతల సభలకు వచ్చి వెళుతూనో, వస్తూనో రోడ్డు ప్రమాదానికి గురయిన ఘటనలు చూశాం. కానీ తొక్కిసలాట జరిగిన ఘటన మాత్రం ఇదే. గతంలో ఎన్నడూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఇలాంటి చోట్ల సభలు పెట్టలేదు. రోడ్ షోలు నిర్వహించినా సరైన స్థలంలో ఆయన నిర్వహించేలా చర్యలు తీసుకునే వారు. అందుకే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. జగన్, పవన్ కల్యాణ్ వంటి నేతల సభల్లోనూ ఇలాంటి తొక్కిసలాట జరగలేదు. కందుకూరులో నిన్న జరిగిన ఘటన దురదృష్టకరమే.
టీవీల్లో ఎక్కువ మంది...
దానిని ఎవరూ కాదనలేరు. కేవలం డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించి ప్రజల్లో జనం ఎక్కువగా వచ్చారని చూపించడమే అసలు లక్ష్యం. దాని కారణంగానే ఇరుకు రోడ్లలో రోడ్ షోలను పెట్టడం ఇటీవల అందరికీ అలవాటుగా మారింది. ఇది రాబిన్ శర్మ ఐడియానే అంటున్నారు. తెలుగుదేశం పార్టీకి రాబిన్ శర్మ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో అనేక ప్రోగ్రాంలు రూపుదిద్దుకుంటున్నాయి. మహానాడు తర్వాత మినీ మహానాడులకు ప్లాన్ చేశారు. అది మైదానంలో జరగడంతో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు. అనంతరం బాదుడే బాదుడు కార్యక్రమం పెట్టారు. ఇది కూడా కొంత ఇరుకు సందుల్లోనే పెట్టారు.
ఐడియా రాబిన్ శర్మదే...
ఈ ఐడియా రాబిన్ శర్మ ఇచ్చిందేనంటారు. టీవీల్లో ఎక్కువ మంది జనం కన్పించడానికి ఈ రకమైన ప్లాన్ వ్యూహకర్త రాబిన్ శర్మ చేశారన్నది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. అదే ఇప్పుడు పార్టీకి అప్రదిష్ట తెచ్చి పెట్టింది. ఇదేం ఖర్మ రాష్ట్రానికి అని రాబిన్ శర్మ టీం ప్లాన్ చేసింది. చంద్రబాబు కూడా ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో మూడు రోజుల పాటు పర్యటనలను రాబిన్ శర్మ ప్లాన్ చేశారు. అలా వెళ్లిన సందర్భంలో మొదటి రోజునే కందుకూరులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
టూర్ కో-ఆర్డినేటర్ ఎక్కడ?
వ్యూహకర్త కేవలం ప్రోగ్రాం డిజైన్ లు చేయడమే కాదు.. అందుకు అనుగుణమైన కార్యక్రమాలను దగ్గరుండే టీంను కూడా ఆయన పర్యవేక్షించాల్సి ఉంటుంది. పార్టీ అధినేత టూర్ ప్రోగ్రాంలకు ముందస్తు చర్యలు తీసుకునేందుకు ఒక విభాగాన్ని రూపొందించుకోవాలి. ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ గా ఒకరిని నియమించుకోవాల్సి ఉంది. అలాంటివేమీ చేయకుండా కేవలం లోకల్ పార్టీ నేతలపైనే వదిలేస్తే ఇలాగే జరుగుతుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. టిక్కెట్ల కోసం పోటీ పడే నేతలు అలాంటి చోట్లనే సభలను ఏర్పాటు చేస్తారు. చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడానికి నేతల మధ్య పోటీ ఇలాంటి పరిస్థితులకు దారి తీస్తుందని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా పార్టీ అధినేత టూర్ లను చూసుకోవడానికి కో-ఆర్డినేటర్ ను నియమించుకోవాలని, సభల నిర్వహణలకు మార్గదర్శకాలను రూపొందించుకోవాలన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
Next Story