Thu Nov 14 2024 20:30:04 GMT+0000 (Coordinated Universal Time)
రోజాకు ఫ్యూచరంతా కష్టమేనట
ఆర్కే రోజా పరిస్థితి నగరి నియోజకవర్గంలో రోజురోజుకూ దిగజారుతుంది. రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత వ్యతిరేకత మొదలయింది
వైసీపీలో ఆర్కే రోజా పరిస్థితి నగరి నియోజకవర్గంలో రోజురోజుకూ దిగజారుతుంది. రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత రోజాపై వ్యతిరేకత మొదలయింది. ప్రజల్లోనే కాకుండా పార్టీలోనే పెల్లుబుకుతున్న వ్యతిరరేకత రోజా హ్యాట్రిక్ విజయానికి గ్యారంటీ లేదు. ఇప్పుడు రోజా మంత్రి అయ్యారు. దీంతో ఇంకా నగరి నియోజకవర్గంలో ఆమె పట్టుకోల్పోయే అవకాశముందని చెబుతున్నారు. మంత్రి పదవి దక్కకుంటే కొంత సానుభూతి అయినా ఉండేదని, అది కూడా ఇప్పుడు ఉండదన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
పట్టుబట్టి మంత్రి పదవిని....
ఆర్కే రోజా పట్టుపట్టి మంత్రి పదవిని దక్కించుకున్నారు. నగరి నియోజకవర్గంలో రెండుసార్లు వరసగా గెలిచిన రోజా హ్యాట్రిక్ విజయం సాధిస్తారని మొన్నటి వరకూ భావించారు. కానీ ప్రభుత్వం, వ్యక్తిగతంగా రోజా పై ఉన్న వ్యతిరేకత రోజురోజుకూ ఎక్కువవుతుంది. రోజాకు సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈసారి రోజా వ్యతిరేక వర్గం ఆమెకు సీటు ఇవ్వవద్దని నేరుగా జగన్ వద్దకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.
రోజా వ్యతిరేకులంతా...
రోజా వ్యతిరేకులకు ఇప్పటికే కొన్ని పదవులు దక్కాయి. వారికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ రోజా వ్యతిరేకవర్గం ఆమెకు వ్యతిరేకంగా పనిచేసింది. వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కొందరు ముఖ్య నేతలకు పదవులు సంపాదించుకున్నా ఒక ముఖ్యమైన సామాజికవర్గం రోజాకు దూరమయిందంటున్నారు. ఈ నియోజకవర్గంలో తమిళనాడు నుంచి వచ్చి స్థిరపడిన వారు కూడా ఎక్కువగా ఉన్నారు. వారు కూడా సమస్యలతో ఎమ్మెల్యే రోజా పనితీరుపై పెదవి విరుస్తున్నారు.
టీడీపీ కూడా....
మరోవైపు టీడీపీ అధినాయకత్వం అక్కడ అభ్యర్థిని మార్చాలని చూస్తుంది. గాలి భానుప్రకాష్ రెడ్డి ఇప్పుడిప్పుడే కొంత యాక్టివ్ అయ్యారు. ఆయన స్థానంలో కొత్త నేతకు టిక్కెట్ ఇచ్చే ఛాన్సుందంటున్నారు. అదే జరిగితే రోజాకు కష్టకాలమేనని అంటున్నారు. రోజాకు ఇంటిపోరుతో పాటు ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఆమె హ్యాట్రిక్ విజయానికి అడ్డుకట్టపడుతుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. జిల్లాలోని వైసీపీ కీలక నేతలు రోజాను ఈసారి ఓడించాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. వారి ప్రోద్బలంతోనే టిక్కెట్ ఇవ్వవద్దంటూ జగన్ వద్దకు నేతలను పంపించాలని నిర్ణయించారు.
Next Story