Sun Dec 22 2024 20:34:44 GMT+0000 (Coordinated Universal Time)
అభ్యర్థి ఎంపికలో ఆలస్యం ఇందుకేనా?
మునుగోడు ఉప ఎన్నికపై అధికార టీఆర్ఎస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు.
మునుగోడు ఉప ఎన్నికపై అధికార టీఆర్ఎస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఇప్పటికే కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రకటించింది. పాల్వాయి స్రవంతిని పార్టీ హైకమాండ్ అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఇక బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎటూ ఉండనే ఉన్నారు. ఆయనకే టిక్కెట్ కన్ఫర్మ్. ఇక మిగిలింది టీఆర్ఎస్ మాత్రమే. ఇప్పటికే ఒక దఫా మునుగోడు నియోజకవర్గంలో భారీ సభను నిర్వహించిన టీఆర్ఎస్ అభ్యర్థిని మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఇంకా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సర్వేలు చేయిస్తున్నారని తెలిసింది. ఫైనల్ సర్వే తర్వాతనే అభ్యర్థి ఎవరో నిర్ణయిస్తారని చెబుతున్నారు.
టీఆర్ఎస్ ను గెలిపించాలంటూ...
అభ్యర్థి ఖరారు కాకుండానే మునుగోడు నియోజకవర్గంలో మంత్రి జగదీష్ రెడ్డి ప్రచారాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. జనం - వనం పేరిట ప్రచారాన్ని చేస్తున్నారు. ఎవరూ పార్టీని వీడకుండా జాగ్రత్త పడుతున్నారు. మండలాల వారీగా పార్టీ సమావేశాలు పెడుతూ నేతల్లోనూ, కార్యకర్తల్లోనూ జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామాల వారీగా కూడా మంత్రి తిరుగుతున్నారు. ప్రతి గ్రామానికి ఇన్ఛార్జిగా ఎమ్మెల్యేను నియమిస్తామని కొద్దిరోజుల క్రితం జరిగిన పార్టీ శాసనసపక్ష సమావేశంలో చెప్పారు. ఇంకా ఎవరినీ నియమించలేదు. దీంతో అంతా మంత్రి జగదీష్ రెడ్డి మాత్రమే ప్రస్తుతం చూసుకుంటున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని మాత్రమే జనం వద్దకు వెళుతున్నారు.
ఇంకా కసరత్తు....
మరోవైపు అభ్యర్థి ఎంపికపై అధినాయకత్వం ఇంకా కసరత్తులు చేస్తూనే ఉంది. ఇందుకు కారణం అక్కడ వర్గ విభేదాలు తలెత్తడమేనని అంటున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కూసుకుంట ప్రభాకర్ రెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించాలనుకున్నా బీసీ నేతల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో కేసీఆర్ కూడా కొంత వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ లు మంత్రి జగదీష్ రెడ్డి నాయకత్వం పట్ల విభేధిస్తున్నారు. ఆయన ఎవరినీ కలుపుకుని పోయే ప్రయత్నం చేయలేదని, తమను ఏ కార్యక్రమానికి ఆహ్వానించడం లేదని చెబుతున్నారు.
విభేదాల పరిష్కారం తర్వాతనే...
బీసీలకు మునుగోడు ఉప ఎన్నికలో టిక్కెట్ తమకు కావాలని బీసీ నేతలు కోరుతున్నారు. కానీ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన కూసుకుంట ప్రభాకర్ రెడ్డి తనకూ టిక్కెట్ కావాలని గట్టిగానే కోరుతున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి మద్దతు కూడా కూసుకుంటకు ఉండటంతో టీఆర్ఎస్ అభ్యర్థిని మరికొంతకాలం తర్వాత ప్రకటించే అవకాశముందని గులాబీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందరినీ సెట్ రైట్ చేసిన తర్వాతనే అభ్యర్థిని ప్రకటిస్తారంటున్నారు. మరోవైపు కమ్యునిస్టుల పార్టీ మద్దతును కూడా టీఆర్ఎస్ పొందగలిగింది. అయినా పార్టీలో ఉన్న విభేధాలను తొలగించిన తర్వాతనే అభ్యర్థిని అధికారికంగా ప్రకటించాలన్న భావనతో గులాబీ బాస్ ఉన్నారు. నవంబరు నెలలో మునుగోడు ఉప ఎన్నిక జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే అభ్యర్థి విషయంలో అధికార టీఆర్ఎస్ ఇప్పటి వరకూ కొంత వెనకబడినట్లే కనిపిస్తుంది.
Next Story