Tue Jan 07 2025 02:25:56 GMT+0000 (Coordinated Universal Time)
ఏంది జగనూ.. ఈ రెడ్లకు ఏమైంది?
అధికార వైసీపీ మాత్రం రెడ్డి సామాజికవర్గం నేతలతోనే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తుంది.
అధికార వైసీపీ మాత్రం రెడ్డి సామాజికవర్గం నేతలతోనే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తుంది. సొంత సామాజికవర్గం కావడంతో జగన్ వారిని దూరంగా పెట్టడం, అన్ని పదవులకూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిలీలంటూ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో రెడ్డి సామాజికవర్గంలో అసంతృప్తి నెలకొందనే చెప్పాలి. పదవులు, నామినేటెడ్ పనులు కూడా వారికే దక్కుతుండటంతో డబ్బులు పోగొట్టుకుని, జగన్ ను కష్టపడి గెలిపించినా ప్రయోజనం లేదని ఆ సామాజికవర్గంలో అసంతృప్తి ఎక్కువగా కనపడుతుంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ముగ్గురు రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలే క్రాస్ ఓటింగ్‌కు పాల్పడటం కూడా చర్చనీయాంశమైంది.
ఆదోని ఎమ్మెల్యే....
ఇక తాజాగా మరో రెడ్డి గారు తన అసంతృప్తి గళాన్ని విప్పారు. కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో కలకలం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్‌కు అనుభవం లేదన్నారు. రెండోసారి ముఖ్యమంత్రిని చేస్తేనే ఆయనకు సంపూర్ణ అవగాహన కలుగుతుందని వ్యాఖ్యానించారు. కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్న మాట వాస్తవమేనని సాయిప్రసాద్ రెడ్డి అన్నారు. ఇది అసంతృప్తి గళమేనని కొందరు అంటున్నారు. కానీ యధాలాపంగా చేసిన వ్యాఖ్యలను పట్టుకుని రాద్ధాంతం చేస్తున్నారని సాయిప్రసాద్ రెడ్డి అనుచరులు అంటున్నారు.
ముగ్గురు ఎమ్మెల్యేలున్నా...
నిజానికి సాయిప్రసాద్ రెడ్డి సోదరులు ముగ్గురు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఉన్నారు. ఒకే ఇంటికి చెందిన మొత్తం ముగ్గురు ఎమ్మెల్యేలున్నా తమకు మంత్రి పదవి ఇవ్వలేదన్న అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, గుంతకల్ ఎమ్మల్యే వెంకట్రామిరెడ్డిలు ఒక తల్లికి పుట్టిన సోదరులు. ముగ్గురు కూడా రాయలసీమలో ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ వారెవ్వరకీ మంత్రి పదవి ఇవ్వకపోవడంపై అసంతృప్తి ఉందని చెబుతున్నారు. అందుకే ఆయన అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
ఉత్సవ విగ్రహాలుగా...
మరోవైపు నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయడం, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా లబ్దిదారుల ఎంపిక చేయడం వంటివి కూడా ఎమ్మెల్యేలకు మింగుడు పడటం లేదంటున్నారు. ఎమ్మెల్యేలను ఉత్సవ విగ్రహాలుగా జగన్ మార్చారని కూడా ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ప్రతి ఆదేశం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి వస్తుండటంతో నియోజకవర్గాల్లో పార్టీ నేతలు కూడా ఎమ్మెల్యేలను లెక్కచేయడం లేదని చెబుతున్నారు. అందుకే ఎమ్మెల్యేల్లో అసంతృప్తి నెలకొందని అంటున్నారు. అందుకే కాస్త బలమున్న రెడ్డి సామాజికవర్గం నుంచే ఈ రకమైన కామెంట్స్ వినపడుతున్నాయంటున్నారు.
Next Story