Fri Dec 20 2024 05:35:29 GMT+0000 (Coordinated Universal Time)
పైలెట్ కు పదవీ యోగం ఉందా?
సచిన్ పైలెట్ కు ఇంతవరకూ ఏ పదవి ఇవ్వలేదు. అదే ఆయన వర్గంలో అసంతృప్తికి కారణమయింది.
రాజస్థాన్ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. రాజస్థాన్ ఎన్నికలు విచిత్రంగా ఉంటాయి. అక్కడ అధికారంలో ఉన్న పార్టీకి మరోసారి అధికారం దక్కదు. ఇది కొన్ని ఎన్నికలుగా కన్పిస్తున్న చిత్రం. ప్రజలు ప్రత్యామ్నాయ పార్టీని కోరుకుంటారు. అంటే ఆల్టర్నేటివ్ గా కాంగ్రెస్, బీజేపీ అధికారంలోకి వస్తుంటాయి. ఇది సంప్రదాయంగా వస్తున్నదే.
సంప్రదాయం ప్రకారం...
రాజస్థాన్ లో 200 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2013లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 162 స్థానాల్లో గెలిచి అధికారంలోకి వచ్చింది. వసుంధర రాజే ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. అయితే ఆమె పై తీవ్ర వ్యతిరేకత వచ్చినా పార్టీ అధినాయకత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. రాజేను సీఎంగా కొనసాగించింది. ఫలితంగా 2018 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీజేపీకి తృటిలోనే అధికారం తప్పింది.
ఈసారి రివర్స్ చేస్తారా?
అయితే సంప్రదాయం ప్రకారం రాజస్థాన్ ఈసారి బీజేపీ వశమవ్వాలి. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ పై ఉన్న వ్యతిరేకత ఈసారి కాంగ్రెస్ కు మరోసారి అధికారం దక్కుతుందనుకుంటున్నారు. వసుంధర రాజే కూడా పెద్దగా యాక్టివ్ గా లేకపోవడం ఆ పార్టీకి ఇబ్బంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ లో బలమైన గ్రూపులున్నాయి. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్, సచిన్ పైలట్ లు గ్రూపులుగా ఉన్నాయి. అశోక్ గెహ్లత్ ను అధిష్టానం పూర్తికాలం ముఖ్యమంత్రిగా కొనసాగించాలని డిసైడ్ అయింది. మధ్యలో సచిన్ పైలెట్ కొంత అసంతృప్తికి గురయినా రాహుల్, ప్రియాంకలు బుజ్జగించి పార్టీలోనే ఉంచారు.
పైలెట్ వర్గంలో అసంతృప్తి....
అశోక్ గెహ్లాత్ కు ఈసారి అవకాశం ఇవ్వకపోవచ్చు. వయసు రీత్యా ఆయనను రాష్ట్ర పరిధి నుంచి తప్పించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. కేంద్ర రాజకీయాల్లో పాత్ర కల్పించే అవకాశాలున్నాయి. అయితే సచిన్ పైలెట్ కు ఇంతవరకూ ఏ పదవి ఇవ్వలేదు. అదే ఆయన వర్గంలో అసంతృప్తికి కారణమయింది. సచిన్ పైలెట్ ను పీసీసీ చీఫ్ గా నియమించాలన్న డిమాండ్ ఊపందుకుంటుంది. ఆయన కూడా ఇటీవల ఒక సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్ని రోజులు తాను మాజీగా ఉండాలని ఆయనే ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. సచిన్ పైలెట్ కు ఇప్పటికైనా పార్టీ పగ్గాలు ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తుంది. మరి పార్టీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది చూడాల్సి ఉంది.
Next Story