Mon Dec 23 2024 15:13:32 GMT+0000 (Coordinated Universal Time)
నేడు జగ్గారెడ్డి రాజీనామా.. కాంగ్రెస్ కు షాక్
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీకి రాజీనామా చేసే అవకాశాలు న్నాయి. పార్టీకి గుడ్ చై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ అందుకే అధికారంలోకి రాలేకపోయింది. నేతల మధ్య ఐక్యత లేదు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉంటారు. తమను మించిన తోపు లేరన్నది ప్రతి కాంగ్రెస్ నేత భావించడం వల్లనే ఆ పార్టీకి రాష్ట్రం ఇచ్చి కూడా ఈ దుస్థితిని కొని తెచ్చుకుంది. తాజాగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీకి రాజీనామా చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆయన తన అనుచరులతో సమావేశమై పార్టీకి గుడ్ చై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు.
పార్టీకి మాత్రమే....
ఈరోజు జగ్గారెడ్డి పార్టీకి రాజీనామా చేయనున్నారని చెబుతున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిగా బాధ్యతలను స్వీకరించక ముందు నుంచే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. రేవంత్ వర్గం తనను సోషల్ మీడియాలో టార్గెట్ చేసిందని జగ్గారెడ్డి పలుమార్లు ఆరోపించారు కూడా. పార్టీలోనే ఉంటూ రేవంత్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే రేవంత్ బ్యాచ్ తనను వేధించడం మానలేదని జగ్గారెడ్డి తాజాగా ఆరోపిస్తున్నారు.
టీఆర్ఎస్ కోవర్టుగా...
తనను టీఆర్ఎస్ కోవర్టుగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని జగ్గారెడ్డి చెబుతున్నారు. ఈరోజు తన రాజీనామా లేఖను కాంగ్రెస్ హైకమాండ్ కు పంపే అవకాశముందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి తన వ్యక్తిగత ఇమేజ్ కోసమే ప్రయత్నిస్తున్నారని, పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నం చేయడం లేదని జగ్గారెడ్డి ఆరోపిస్తున్నారు. ఇద్దరి మధ్య కొన్ని నెలలుగా మాటలు కూడా లేవు.
స్వతంత్ర ఎమ్మెల్యేగా....
పార్టీ ఇన్ ఛార్జి మాణికం ఠాగూర్ సయితం రేవంత్ కు వంత పాడుతున్నారని జగ్గారెడ్డి ఆరోపిస్తున్నారు. పటాన్ చెరువులోని మత్తంగిలో తన అనుచరులతో సమావేశమైన జగ్గారెడ్డి పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. స్వతంత్ర ఎమ్మెల్యేగానే ఎన్నికల వరకూ కొనసాగాలని నిర్ణయించుకున్నారు. అయితే ఏ పార్టీలో చేరాలన్నది ఆయన ఇంకా నిర్ణయించుకోలేదు. మరి కాంగ్రెస్ నేతలు బుజ్జగించి తగిన హామీ ఇస్తే జగ్గారెడ్డి కాంగ్రెస్ లో కొనసాగే అవకాశాలు కూడా లేకపోలేదు.
Next Story