Sat Nov 16 2024 01:25:07 GMT+0000 (Coordinated Universal Time)
ఆగస్ట్ తర్వాత దిక్కులు చూడాల్సిందేనా?
ఏపీలో ఆగస్టు నుంచి సీన్ మారనుంది. ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టే అవకాశలున్నాయని అంటున్నాయి ఢిల్లీ వర్గాలు
ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు నుంచి సీన్ మారనుందా? వైసీపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం చుక్కలు చూపిస్తుందా? అంటే అవుననేనని అంటున్నాయి హస్తిన వర్గాలు. వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు అన్ని రకాలుగా ఇబ్బంది పడుతుంది. ఆర్థికంగా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఎన్నికలు రెండేళ్లు మాత్రమే ఉండటంతో ఇటు అభివృద్ధి పనులు, అటు సంక్షేమ పథకాలు నిరాటంకంగా అమలు చేయాల్సి ఉంటుంది. అందుకు నిధులు అవసరం. అందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం తప్పనిసరి.
తెలంగాణలో ప్రస్తుతం...
ఇప్పటికే పొరుగు రాష్ట్రమైన తెలంగాణ అప్పలు దొరకక ఇబ్బంది పడుతుంది. కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంతో సంక్షేమ పథకాలు నిలిచి పోయే పరిస్థిితి ఏర్పడింది. తమతో వైరం పెంచుకున్న కేసీఆర్ పై ఈ విధంగా కేంద్రం కసి తీర్చుకుంటుంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉంది. ఏపీలో అలా కాదు. జగన్ అవసరం ఉంది. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీల బలం ఉన్న జగన్ బీజేపీకి మంచిగానే కన్పిస్తున్నారు. అందుకే అప్పులు తీసుకునేందుకు అడిగిన వెంటనే అనుమతులు మంజూరు చేస్తుంది.
జగన్ తో సఖ్యత...
ఎక్కువ మంది ఎంపీలు, ఎమ్మెల్యేలున్న పార్టీ కావడంతో రాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ కీలకంగా మారనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ తమ అభ్యర్థిని నిలబెట్టే అవకాశముంది. జగన్ మద్దతు ఈఎన్నికల్లో అవసరం. అందుకే రాష్ట్రపతి ఎన్నికల వరకూ జగన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రధాని, హోంమంత్రి అపాయింట్మెంట్ దొరుకుతుంది. అప్పులు కూడా పుడతాయి. కానీ రాష్ట్రపతి ఎన్నికల ముగిసిన తర్వాత మాత్రం సీన్ మార్చేస్తారని చెబుతున్నారు. రాష్ట్రపతి ఎన్నికలు వచ్చే నెల చివరితో ముగియనున్నాయి.
ఆశలు లేకపోయినా...?
ఆంధ్రప్రదేశ్ పై బీజేపీకి అంతగా ఆశలు లేకపోయినా జనసేన పొత్తుతో కొన్ని స్థానాలనయినా గెలుచుకుంటామన్న నమ్మకం ఇప్పుడిప్పుడే ఆ పార్టీకి కలుగుతుంది. అందుకే వరసగా కేంద్రం పెద్దలు ఏపీకి వచ్చి వెళ్లిపోతున్నారన్న టాక్ కూడా నడుస్తుంది. టీడీపీతో కలవకపోయినా జనసేనతో కలసి కొన్ని సీట్లను (పార్లమెంటు) కైవసం చేసుకునే దిశగా బీజేపీ ప్రయత్నాలుంటాయంటున్నారు. అందుకే ఆగస్టు నెల నుంచి జగన్ కు కేంద్ర ప్రభుత్వం చుక్కలు చూపిస్తుందంటున్నారు. అన్ని రకాలుగా ఇబ్బందులను పెడుతుందన్నది హస్తిన వర్గాల టాక్. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Next Story