Mon Dec 23 2024 11:17:21 GMT+0000 (Coordinated Universal Time)
VandeBharatRail : టికెట్ల రేట్లు మామూలుగా లేవు.. ట్రైన్ టైమింగ్స్, ధరల వివరాలివిగో
వందేభారత్ మాత్రం 8 గంటల 40 నిమిషాల్లోనే గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. అంటే గంటన్నర సమయం..
తెలుగు రాష్ట్రాల మధ్య వందేభారత్ పరుగులు తీయనుంది. సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య నడవనున్న ఈ రైలును ప్రధాని నరేంద్రమోదీ జనవరి 19న ప్రారంభించనున్నారు. అయితే ఆ రోజు ప్రయాణికులకు రైలులో ప్రయాణించేందుకు అనుమతి లేదు. రైలును ఎప్పటి నుండి అందుబాటులోకి తీసుకొస్తారో.. అధికారులు ప్రకటించాల్సి ఉంది. సాధారణ రైలు కంటే.. వందే భారత్ రైలులో పలు ప్రత్యేకతలున్నాయి. పగటిపూట ప్రయాణం మొదలై.. సాయంత్రానికి పూర్తవుతుంది. వందేభారత్ రైలులో బెర్త్ లు ఉండవు. కేవలం చైర్ కార్ సీట్స్ మాత్రమే ఉంటాయి. కానీ.. దురంతో రైలు కంటే.. ఈ రైలు మరింత వేగంగా ప్రయాణిస్తుంది.
ప్రస్తుతం.. విశాఖ-సికింద్రాబాద్ మధ్య నడిచే దురంతో రైలు 10.10 గంటల్లో గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. వందేభారత్ మాత్రం 8 గంటల 40 నిమిషాల్లోనే గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. అంటే గంటన్నర సమయం ఆదా అవుతుంది. ఇక మిగతా రైళ్లకైతే.. సికింద్రాబాద్ నుండి విశాఖకు చేరుకునేందుకు 12 గంటల 45 నిమిషాల సమయం వరకూ పడుతుంది. క్రాసింగ్ ఉంటే.. మరింత లేట్ కూడా అవుతుంది. ఛార్జీల విషయానికొస్తే.. ఇప్పటి వరకూ ఇంత ధర ఉంటుందని రైల్వే శాఖ ప్రకటించలేదు. కానీ.. వందేభారత్ రైల్లో ప్రయాణించాలంటే.. భారీగా ఖర్చు పెట్టాల్సిందేనని తెలుస్తోంది. సామాన్యుడి ఈ రైల్లో ప్రయాణించాలంటే కష్టమేనన్న వార్తలు వినవస్తున్నాయి.
ఢిల్లీ-జమ్మూలోని కట్రా మధ్య ఇటీవలే వందేభారత్ రైలు ప్రారంభమైంది. ఆ రెండు నగరాల మధ్య దూరం 655 కిలోమీటర్లు. చైర్ కార్ టికెట్ ధర రూ. 1,665 కాగా, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ధర రూ. 3,055. సికింద్రాబాద్-విశాఖ నగరాల మధ్య దూరం 657 కిలోమీటర్లు. అంటే ఇంచుమించుగా.. అవే టికెట్ ధరలు ఉండొచ్చని అంచనా.
సికింద్రాబాద్ - విశాఖపట్నం వందేభారత్ రైలు సమయాలు
సికింద్రాబాద్ - విశాఖపట్నం నగరాల మధ్య ప్రతిరోజూ వందేభారత్ రైలు నడుస్తుంది. ఉదయం 5.45 గంటలకు విశాఖపట్నంలో బయల్దేరి మధ్యాహ్నం 2.25 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. మధ్యలో రాజమండ్రి(8.08), విజయవాడ(9.50), వరంగల్(12.05)లో ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్లో మధ్యాహ్నం 2.45 గంటలకు బయలుదేరి రాత్రి 11.25 గంటలకు విశాఖపట్టణం చేరుకుంటుంది. మధ్యలో వరంగల్ (4.25), విజయవాడ (7.10), రాజమండ్రి (9.15)లో ఆగుతుంది.
Next Story