Fri Nov 15 2024 01:08:31 GMT+0000 (Coordinated Universal Time)
ముహూర్తం రెడీ.. ఆ పార్టీలోకే?
సీనియర్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం వైసీపీలో అసంతృప్త నేతగా ఉన్నారు
సీనియర్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం వైసీపీలో అసంతృప్త నేతగా ఉన్నారు. జగన్ ప్రభుత్వంపై సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు. డీఎల్ గత ఎన్నికలకు ముందు వైసీపీకి మద్దతుదారుగా ఉన్నారు. ఆయన జగన్ ను కలిశారు తప్ప పార్టీ కండువాను కప్పుకోలేదంటారు. అయితే అధికారంలోకి వస్తే ఏదో ఒక పదవి దక్కుతుందని డీఎల్ రవీంద్రారెడ్డి ఆశించారు. ఎమ్మెల్సీ పదవిని ఆయన కోరుకున్నారు.
ఎమ్మెల్సీ పదవి కోసం....
కానీ జగన్ కడప జిల్లాలో ప్రొద్దుటూరుకు చెందిన రమేష్ యాదవ్, బద్వేలుకు చెందిన డీసీ గోవిందరెడ్డికి ఇచ్చారు. దీంతో డీఎల్ రవీంద్రారెడ్డి ఆశలు గల్లంతయ్యాయి. అందుకే ఆయన గత కొంత కాలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అయితే ఆయన టీడీపీలోకి వెళ్లాలని కొంత ఆలోచన చేశారు. వచ్చే ఎన్నికల్లో మైదుకూరు టిక్కెట్ తనకు ఇస్తే పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని డీఎల్ రవీంద్రారెడ్డి టీడీపీ అధినాయకత్వానికి సంకేతాలు పంపారు. అక్కడ పార్టీకి పుట్టా సుధాకర్ యాదవ్ కొన్నేళ్లుగా పనిచేస్తున్నారు.
బీజేపీలో చేరాలని....
దీంతో టీడీపీ అధినాయకత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేయాలని డీఎల్ రవీంద్రారెడ్డి భావిస్తున్నారు. టీడీపీ, వైసీపీలకు ప్రత్యామ్నాయంగా ఆయన బీజేపీని ఎంచుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం బీజేపీ దేశంలో నెంబర్ వన్ గా ఉంది. ఏపీలో దాని ప్రభావం పెద్దగా లేకపోయినా తన వ్యక్తిగత ఇమేజ్, జనసేన పొత్తుతో మైదుకూరులో పోటీ చేసి విజయం సాధించవచ్చని డీఎల్ రవీంద్రారెడ్డి భావిస్తున్నారు.
పొత్తులో భాగంగా....
ఇందులో భాగంగా బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నెల 19వ తేదీన కడపలో బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. వైసీపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ సభను కడపలోనే బీజేపీ ఏర్పాటు చేసింది. కేంద్ర నాయకులు కూడా ఈ సభకు హాజరుకానున్నారు. వీరి సమక్షంలోనే డీఎల్ రవీంద్రారెడ్డి బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. బీజేపీకి కూడా కడప జిల్లాలో నాయకుల అవసరం. దీంతో ఈ నెల 19న డీఎల్ బీజేపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు.
Next Story