Mon Dec 23 2024 09:41:52 GMT+0000 (Coordinated Universal Time)
డీఎల్ డీలా పడ్డారు.. రీజన్ ఇదేనా?
ీసీనియర్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి పరిస్థితి రాజకీయంగా ఎటు కాకుండా పోయింది. ఆయన ఏ పార్టీలో చేరాలన్నా డీల్ కుదరడం లేదు.
డీఎల్ రవీంద్రారెడ్డి కడప జిల్లాలో సీనియర్ నేత. ఆయన రాజకీయాల్లో రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి పెద్దగా క్రియాశీలకంగా లేరు. అయితే 2019 ఎన్నికలకు ముందు డీఎల్ రవీంద్రారెడ్డి వైసీపీకి మద్దతు పలికారు. ఆ పార్టీలో చేరినట్లే అనుకోవాలి. అయితే వైసీపీలో చేరినా ఆ పార్టీ అధినాయకత్వం గుర్తించలేదు. కడప జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న తనను పట్టించుకోకుండా బద్వేల్ కు చెందిన డీసీ గోవింద్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవిని రెన్యువల్ చేశారు. ప్రొద్దుటూరు చెందిన రమేష్ యాదవ్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇక రాజ్యసభ పదవి కూడా దక్కలేదు. మూడేళ్లు ఓపిక పట్టిన డీఎల్ రవీంద్రారెడ్డి ఎనిమిది నెలల క్రితం వైసీపీ ప్రభుత్వం అసంతృప్తిని వెళ్లగక్కారు. జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
వైసీపీ పై విమర్శలు...
మూడేళ్లలో ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిందన్నారు. బాబాయి వివేకా హత్య కేసులో అసలు నిందితులు ఎవరో జగన్ కు తెలుసునని కూడా వ్యాఖ్యానించారు. ప్రజలు జగన్ ప్రభుత్వంపై అసంతృప్తితో రగలి పోతున్నారని వచ్చే ఎన్నికలలో జగన్ కు ఓటమి తప్పదని కూడా ఆయన జోస్యం చెప్పారు. ఇది జరిగి ఎనిమిది నెలలు పైగానే అవుతుంది. అప్పటి నుంచి మళ్లీ ఆయన సైలెంట్ అయ్యారు. డీఎల్ రవీంద్రారెడ్డి టీడీపీలో చేరబోతున్నారని, చంద్రబాబు వద్దకు తన దూతలను కూడా పంపారని వార్తలు వచ్చాయి. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని మైదుకూరులో ప్రచారం జరుగుతోంది.
టీడీపీలో చేరాలన్నా...
మైదుకూరు నియోజకవర్గంలో పుట్టా సుధాకర్ యాదవ్ ఉన్నారు. బీసీ కోటా కింద ఆయనకు టిక్కెట్ మరోసారి ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు కూడా హామీ ఇచ్చారట. నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. దీంతో మైదుకూరు టిక్కెట్ డీఎల్ రవీంద్రారెడ్డికి వచ్చే ఎన్నికల్లో అవకాశాలు లేవు. అయితే బీజేపీలో చేరతారని కూడా కొంత కాలం ప్రచారం జరిగింది. బీజేపీలో చేరితే జనసేన మద్దతుతో మైదుకూరులో విజయం సాధించే అవకాశాలున్నాయని అంచనా వేశారు. అయితే బీజేపీ, టీడీపీ, జనసేన కలుస్తాయని ప్రచారం జరుగుతుండటంతో డీఎల్ రవీంద్రారెడ్డి వెనక్కు తగ్గినట్లే కనిపిస్తున్నారు.
ఏ పార్టీలోనూ...
ఇప్పుడు డీఎల్ రవీంద్రారెడ్డి పరిస్థితి రాజకీయంగా ఎటు కాకుండా పోయింది. వైసీపీ నుంచి బయటకు వచ్చారు. టీడీపీలో చేరేందుకు అడ్డంకులున్నాయి. పోనీ టీడీపీకి మద్దతిస్తే ఏదైనా నామినేటెడ్ పదవి దక్కుతుంది అంటే అదీ నమ్మకం లేదు. బీజేపీ, జనసేనలో చేరినా ఫలితం లేదు. దీంతో ఆయన 2024 ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏ పార్టీ నుంచి అవకాశాలు కన్పించడం లేదు. అందుకే డీఎల్ కొన్ని నెలల నుంచి మౌనంగా ఉన్నారు. ఆయన అనుచరులు కూడా వత్తిడి తెచ్చినా పెద్దగా స్పందన లేదని తెలిసింది. వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడిన డీఎల్ ప్రస్తుతం సైలెంట్ గా ఉండటానికి గల కారణాలపై కడప జిల్లాలో చర్చోప చర్చలు జరుగుతున్నాయి.
Next Story