Sat Dec 21 2024 00:29:47 GMT+0000 (Coordinated Universal Time)
పాపం..నాగం.. ఇక చివరి ఛాన్స్ కోసం
సీనియర్ నేత నాగం జనార్థన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీపై అనుమానం నెలకొంది
దశాబ్దకాలం పాటు అసెంబ్లీ మెట్లు ఎక్కలేదు. అందుకు ఆయన తీసుకున్న నిర్ణయాలే కారణం. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక వెలుగు వెలిగిన నేత దశాబ్దకాలంగా ఎదురు చూస్తూనే ఉన్నారు. సొంత పార్టీ పెట్టినా ఫలితం లేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు పార్టీలు మారినా ప్రయోజనం శూన్యం. వయసు మీద పడుతుంది కాని రిజల్ట్ కనపడటం లేదు. ఆయనే నాగం జనార్థన్ రెడ్డి. మాజీ మంత్రిగా దశాబ్దకాలాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పేరున్న నేత. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జనార్థన్ రెడ్డి 2014 తర్వాత దాదాపు కనుమరుగయ్యారనే చెప్పాలి.
పదేళ్ల క్రితం...
2012లో జరిగిన ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన ఆయన చివరిసారి గెలుపును చూశారు. 1994 నుంచి 2012లో జరిగిన ఉప ఎన్నికల వరకూ ఆరు సార్లు నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి గెలుపొందిన నాగం జనార్థన్ రెడ్డి రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టారు. అది నడపలేని నాగం చివరకు బీజేపీలో సెటిల్ అవుదామని భావించారు. కానీ బీజేపీలో ఆయనను పెద్దగా పట్టించుకోలేదు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 2018 ఎన్నికల్లో నాగర్ కర్నూలు నుంచి పోటీ చేసినప్పటికీ ప్రజలు ఆశీర్వదించలేదు. దీంతో నాగం జనార్థన్ రెడ్డి గెలుపు కోసం ఎదురు చూస్తున్నారు.
వివాద రహితుడిగా...
సీనియర్ నేతగా, మంత్రిగా నాగం అందరికీ సుపరిచితులే. అంతే కాకుండా ఆయన కుమారుడు నాగం శశిధర్ రెడ్డి రాజకీయ జీవితం కూడా ఒక కొలిక్కి రాలేదు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా తెలుగుదేశం హయాంలో పనిచేసిన నాగం జనార్థన్ రెడ్డికి మంచి పేరే ఉంది. వివాద రహితుడిగానే ఆయన రాజకీయాల్లో పేరు పొందారు. రాజకీయంగా శత్రువులు అనేక మంది ఉన్నప్పటికీ, ప్రజల్లో మాత్రం పలుకుబడిని సంపాదించుకున్నారు. ఎటువంటి అవినీతి ఆరోపణలు ఆయనపై లేవు. అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం ఉన్న నేతగా ఆయనకు పేరుంది.
ఏదో నెట్టుకొస్తున్నా...
ప్రస్తుతం కాంగ్రెస్ లో ఏదో నెట్టుకొస్తున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత కొంత నాగంకు ప్రయారిటీ లభిస్తుందంటున్నారు. పాతపరిచయాలతో పాటు టీడీపీలో ఉన్న అనుబంధం, సీనియర్ నేతగా రేవంత్ నాగం జనార్థన్ రెడ్డిని గౌరవిస్తుండటం వల్లనే ఆయన గాంధీభవన్ కు తరచూ వచ్చి వెళుతున్నారు. ఈసారి నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి మరోసారి పోటీకి దిగుతారా? లేదా తన కుమారుడు నాగం శశిధర్ రెడ్డిని బరిలోకి దింపుతారా? అన్నది ఇంకా తేలలేదు. అయితే ఇదే తనకు చివరి ఛాన్స్ అన్న నినాదంతో నాగం ప్రజల ముందుకు వెళ్లే అవకాశముందంటున్నారు. కాంగ్రెస్ లో ఆయనను పెద్దగా పట్టించుకోకపోయినా మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న ఆయన కల నెరవేరుతుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
Next Story