Mon Dec 23 2024 18:23:47 GMT+0000 (Coordinated Universal Time)
రాజు గారిది రైట్ "వే" నేనట
టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు సానుభూతిని పొందారు. ఆయనపై కేసు నమోదు కావడం ఆయనకే లాభం తెచ్చిపెడుతుంది
విజయనగరం జిల్లాలో గజపతిరాజులు దశాబ్దాల కాలం పాటు ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. తొలి నుంచి టీడీపీలోనే ఉండి సీనియర్ నేతగా అశోక్ గజపతి రాజు అనేక పదవులను అనుభవించారు. ఎంపీగా, కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా సేవలందించారు. కానీ గత ఎన్నికల్లో ఘోరమైన ఓటమిని చవిచూశారు. రాజుగారి కోటను వైసీపీ బద్దలు కొట్టగలిగింది. అశోక్ గజపతి రాజు తో పాటు ఆయన కుమార్తె ఆదితి గజపతి రాజు సయితం ఓటమిపాలయ్యారు.
సొంత పార్టీలోనే...
సొంత పార్టీలోనే తనకు వ్యతిరేకత ఉన్నా అశోక్ గజపతిరాజు భరిస్తూ వస్తున్నారు. పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తి ఉన్నా బయటపడకుండా గుమ్మనంగా గజపతి రాజు కొనసాగుతున్నారు. కానీ ఆయనకు వేరే దారిలేదు. టీడీపీలోనే ఉండి తన కుటుంబ ప్రతిష్టతో పాటు వ్యక్తిగతంగా తన ఇమేజ్ ను అశోక్ గజపతిరాజు కాపాడుకోవాలని భావిస్తున్నారు. అందుకే ఆయన ప్రతి విషయంలోనూ తనకు సానుభూతిని తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.
నిజాయితీగల నేతగా....
నిజానికి అశోక్ గజపతిరాజు మిగిలిన నేతలకు భిన్నం. ఆయన అవినీతి ఆరోపణలకు దూరం. ఎవరికీ హాని చేయని వ్యక్తిత్వం ఆయనది. అటువంటి ఆయనపై కేసులు నమోదు చేస్తే ఖచ్చితంగా సింపతీ వస్తుంది. అశోక్ గజపతిరాజుకు కూడా కావాల్సిందదే. తనను ప్రభుత్వం ఎలా ఇబ్బంది పెడుతుంది ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన భావిస్తున్నారు. అందుకే రామతీర్థం ఘటనను తనకు అనుకూలంగా అశోక్ గజపతిరాజు మార్చుకోగలిగారు.
పుష్కలంగా సానుభూతి....
ఆయన అనుకున్నట్లే విజయనగరం ప్రాంతంలో సింపతీ వచ్చింది. పెద్దాయనపై కేసు నమోదు చేయడమేంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రామతీర్థం ఆలయానికి ఛైర్మన్ గా ఉన్న రాజుగారిని కార్యక్రమానికి ఆహ్వానించకపోగా ఆయనను ప్రభుత్వం అవమానించిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. కావాలనే మంత్రులను అశోక్ గజపతిరాజు రెచ్చగొట్టి పరిస్థితిని తనవైపునకు తిప్పుకోగలిగారు. విజయనగరం జిల్లాలో అశోక్ గజపతిరాజుకు రాజకీయ పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని చెప్పక తప్పదు.
Next Story