Fri Nov 22 2024 20:56:28 GMT+0000 (Coordinated Universal Time)
నువ్వు మామూలోడివి కాదు సామీ
సీనియర్ నేత యనమల రామకృస్ణుడు తన మాటను నెగ్గించుకున్నారు. తన కుమార్తెకు ఇన్ఛార్జి పదవి ఇప్పించుకున్నారు
సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అంటే టీడీపీ అధినేత చంద్రబాబుకు గౌరవం. ఆయన సలహాలు, సూచనలు కూడా పార్టీకి అవసరం అని భావిస్తారు. పార్టీ క్లిష్టంగా ఉన్న సమయాల్లో యనమల రామకృష్ణుడు చేసిన సాయాన్ని చంద్రబాబు ఎప్పటికీ మరిచిపోలేరు. అందుకే ఆయనకు అధికారంలో ఉంటే ఖచ్చితంగా మంత్రిపదవి లభిస్తుంది. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోయినా శాసనమండలికి పంపి చంద్రబాబు ఆయనకు గౌరవిస్తారు. యనమల సలహాలు తనకు భవిష్యత్ లోనూ ఎంతో అవసరమవుతాయని చంద్రబాబు ఆయనను దూరం చేసుకోరు.
నెంబరు 2 ఇప్పుడు...
నిజానికి లోకేష్ పార్టీలో యాక్టివ్ కాకముందు యనమల రామకృష్ణుడు నెంబర్ 2గా ఉండేవారు. లోకేష్ ఎంట్రీ తర్వాత కీలక నిర్ణయాల్లో తన ప్రమేయం పెద్దగా లేకపోయినా తూర్పు గోదావరి జిల్లా రాజకీయాల్లో మాత్రం ఆయనదే పై చేయి అని చెప్పక తప్పదు. తూర్పు గోదావరి జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో పొత్తులు వంటి నిర్ణయాలపై కూడా యనమల సలహాలు చంద్రబాబు తప్పకుండా తీసుకుంటారు. యనమలకు భవిష్యత్ రాజకీయాలను అంచనా వేసే శక్తి ఉందని చంద్రబాబు నమ్ముతారు. అందుకే యనమలకు ఎవరు అవునన్నా కాదన్నా చంద్రబాబు వద్ద మాత్రం గౌరవం ఏమాత్రం తగ్గదు.
చంద్రబాబుకు...
ఇక ఆయన సొంత నియోజకవర్గమైన తునిలో ఆయన మాట ఎలా కాదంటారు? గత కొద్ది రోజులుగా తుని నియోజకవర్గం టీడీపీలో విభేదాలు తలెత్తాయి. యనమల రామకృష్ణుడు ఆయన సోదరుడు కృష్ణుడు మధ్య కొంత గ్యాప్ వచ్చింది. యనమల తన కుమార్తెను దివ్యను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించాలని భావిస్తున్నారు. ఇటీవల తుని కార్యకర్తల సమావేశంలో చూచాయగా చెప్పారు. కానీ ఆయన సోదరుడు మాత్రం అందుకు అంగీకరించడం లేదు. తానే మరోసారి పోటీ చేస్తానని చెబుతున్నారు. యనమల కృష్ణుడు ముఖ్య నేతలతో మాట్లాడిన ఆడియో కూడా వైరల్ అయింది.
తుని ఇన్ఛార్జిపదవిని....
అయితే చివరకు యనమల రామకృష్ణుడు మాటే నెగ్గింది. యనమల దివ్యను తుని ఇన్చార్జిగా నియమిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అంటే యనమల కృష్ణుడుకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ లేనట్లేనని చెప్పారు. కృష్ణుడు పట్టుబట్టినా, సోదరుడు వత్తిడి తెచ్చినా తన కుమార్తె రాజకీయ భవిష్యత్ కోసం యనమల దివ్య కు ఇన్ఛార్జి పదవి ఇప్పించుకున్నారంటారు. చంద్రబాబు కూడా యనమలను కాదనలేకపోయారు. యనమల కృష్ణుడు తుని నుంచి రెండుసార్లు వరసగా ఓటమిపాలయ్యారు. మరి ఈసారి టిక్కెట్ ఇవ్వకుంటే ఆయన ఏం చేస్తారన్నది ఇంకా తెలియరాలేదు. ఆయనను శాసనమండలి, రాజ్యసభకు పంపిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చే అవకాశముంది. మొత్తం మీద యనమల సోదరుడు పంతం పట్టినా తన మాటనే నెగ్గించుకోవడం తునిలో హాట్ టాపిక్ గా మారింది.
Next Story