Mon Dec 23 2024 05:02:02 GMT+0000 (Coordinated Universal Time)
రేవంత్ ఒక్కడి వల్ల సాధ్యమవుతుందా?
రేవంత్ రెడ్డి పై అసంతృప్తిని ఉప ఎన్నికల్లో సీనియర్లు చూపుతున్నారు.. నష్టపోయేది పార్టీనేనన్న సంగతిని విస్మరిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టడం అంత సులువు కాదు. సీనియర్లు ఎక్కువ.. ప్రజల్లో క్రేజ్ ఉన్న నేతలు తక్కువగా ఉండే ఆ పార్టీ తెలంగాణలో బలపడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కొంత పార్టీ గాడిలో పడిందనే చెప్పాలి. అయినా రేవంత్ ఏ ఒక్క నిర్ణయాన్ని సొంతంగా తీసుకోలేకపోతున్నారు. ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకుంటే వెనక్కు లాగే వారు ఎక్కువవుతున్నారు. ఫ్రీ హ్యాండ్ లేదు. పీసీసీ అధ్యక్షుడిగా ఆయన పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలన్న ప్రయత్నాలను సీనియర్లు కొందరు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారన్న విమర్శలున్నాయి.
ఈ ఎన్నికల్లో గెలిస్తే...
మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధిస్తే సార్వత్రిక ఎన్నికలకు కొంత పట్టు దొరుకుతుంది. ఆ సంగతి కాంగ్రెస్ మహామహులెవరికీ తెలియంది కాదు. తమకు కూడా రాజకీయంగా ఉపయోగపడుతుంది. కానీ మనసు పెట్టి ఉప ఎన్నికల్లో పార్టీని గెలిపించాలన్న ఆలోచన లేదు. ఎవరి ధోరణి వారిదే. కష్టపడరు. కానీ పదవులు మాత్రం కావాలంటారు. తమకు పార్టీలో ప్రాధాన్యత కోరుకుంటారు. కానీ ఉప ఎన్నికల్లో చెమటోడ్చే తత్వం ఎవరికీ లేదు. ఇన్ ఛార్జులుగా నియమించిన కొందరు నేతలు కూడా ఆషామాషీగా మునుగోడులో పర్యటిస్తున్నారు. కొందరు తాము ఈ ఎన్నిక బాధ్యతను నిర్వహించలేమని పక్కకు తప్పుకున్నారు.
టానిక్ వంటిదని తెలిసినా...
రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తెలంగాణలో జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలయింది. ఒక్క నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లోనే గట్టి పోటీ ఇచ్చింది. అప్పుడు కూడా కాంగ్రెస్ నేతల్లో అనైక్యత కారణంగానే ఓటమి పాలయిందన్న విమర్శలున్నాయి. పార్టీ క్యాడర్ లో నైరాశ్యం అలుముకుంది. దాని నుంచి బయటపడాలంటే మునుగోడు ఉప ఎన్నికలో గెలవడం ముఖ్యం. వచ్చే ఎన్నికల్లో సమాయత్తమవ్వడానికి మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ కు టానిక్ లాంటింది. దీనిని కూడా కాంగ్రెస్ నేతలు సద్వినియోగం చేసుకోలేక పోతున్నారు. మునుగోడులో బలమైన ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ కాంగ్రెస్ నేతలు పెద్దగా పట్టించుకోవడం లేదు. సీరియస్ నెస్ కొరవడింది. మునుగోడులో గెలిస్తే అది రేవంత్ ఖాతాలో పడుతుందని కొందరు ముందుగానే కాళ్లకు అడ్డం పడుతున్నారు. కొందరు మాత్రమే తమకు అప్పగించిన పనిని చేసుకు పోతున్నారు. అందరూ కలసి సమిష్టిగా మాత్రం పనిచేయడం లేదు.
ముందుగానే అభ్యర్థిని ప్రకటించినా...
రేవంత్ రెడ్డి పై అసంతృప్తిని ఉప ఎన్నికల్లో సీనియర్ నేతలు చూపుతున్నారు. అంతిమంగా నష్టపోయేది కాంగ్రెస్ పార్టీనేనన్న సంగతిని విస్మరిస్తున్నారు. రాహుల్ గాంధీ వరంగల్ వచ్చినప్పుడు క్లాస్ పీకినా ప్రయోజనం లేదు. హైదరాబాద్ కే ఎక్కువమంది నేతలు పరిమితమవుతున్నారు. రేవంత్ రెడ్డి రెక్కల కష్టమొక్కటి సరిపోదు. దానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందితేనే పార్టీకి బలం చేకూరుతుంది. ముందుగానే అభ్యర్థిని ప్రకటించారు. పాల్వాయి స్రవంతి మాత్రం ప్రజల వద్దకు నేతలతో సంబంధం లేకుండా వెళుతున్నారు. అభ్యర్థి ని ముందుగా ప్రకటించిన అడ్వాంటేజీని కూడా కాంగ్రెస్ వాడుకోలేకపోతుంది. రేవంత్ రెడ్డి కూడా క్రమం తప్పకుండా మునుగోడుకు వెళుతూ కార్యకర్తల్లో భరోసా కల్పిస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు సమిష్టిగా పనిచేయగలిగితే.. రేవంత్ రెడ్డికి సహకరించగలిగితే మునుగోడులో సక్సెస్ పెద్ద కష్టమేమీ కాదన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.
Next Story