Sun Nov 17 2024 14:15:51 GMT+0000 (Coordinated Universal Time)
ఇరుకు సందే.. ప్రాణాలు పోవడానికి కారణమా?
కందుకూరులో చంద్రబాబు రోడ్ షోలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు మరణించడం సంచలనం కల్గించింది.
చంద్రబాబును ఆకట్టుకోవడానికి నేతలు చేస్తున్న ప్రయత్నాలు మరణాలకు దారి తీస్తున్నాయి. జనసమీకరణ చేయలేక చంద్రబాబు దృష్టిలో పడటానికి చేస్తున్న ప్రయత్నాలే ఇందుకు కారణమని చెప్పక తప్పదు. ఇరుకు సందుల్లో సభను ఏర్పాటు చేయడంతోనే ఈ దుర్ఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. నేతలు పోటా పోటీగా జనసమీకరణ చేయాలని కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి కూడా ఆదేశాలు అందడంతో పల్లెటూళ్ల నుంచి కార్యకర్తలను తరలిస్తున్నారు. కందుకూరులో చంద్రబాబు రోడ్ షోలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు మరణించడం సంచలనం కల్గించింది. ఇది పూర్తిగా నిర్వాహకుల నిర్లక్ష్యంగానే చూడాలి.
ఇరుకు సందులో...
కందుకూరు పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ రోడ్డు అరవై అడుగులు కూడా లేదు. ఆ అరవై అడుగుల రోడ్డును దుకాణాదారులు కొంత ఆక్రమించారు. రోడ్డుకు అటువైపు, ఇటువైపు డ్రైనేజీ గుంతలు ఉన్నాయి. దీనికితోడు ఇరువైపులా చంద్రబాబుకు స్వాగతం చెబుతూ ఫ్లెక్సీలు కట్టారు. మరోవైపు ద్విచక్ర వాహనాలను నిలిపారు. దీంతో ఎన్టీఆర్ సర్కిల్ రోడ్డు ముప్ఫయి ఐదు అడుగులకు మించిలేదని చెబుతున్నారు. కందుకూరు టీడీపీ టిక్కెట్ ను ఆశిస్తున్న ఇంటూరు రాజేష్, ఇంటూరు నాగేశ్వరరావు పోటా పోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, సభకు వచ్చిన వారి ద్విచక్ర వాహనాలు కూడా రోడ్డు పక్కనే పార్క్ చేయడంతో రోడ్డు కుచించుకుపోయింది. నాలుగు వేలు పట్టే రోడ్డులోకి ఎక్కువ మంది జనం రావడంతో ఈ ఘటన జరిగింది. దీంతో పాటు టిక్కెట్ ఆశిస్తున్న ఇరువురి నేతలకు చెందిన కార్యకర్తలు పోటా పాటీ నినాదాలు చేసుకుంటూ ముందుకు రావడంతోనే తొక్కిసలాట జరిగిందని చెబుతున్నారు.
రోడ్ షో పేరుతో...
రోడ్డు చిన్నది కావడంతో చంద్రబాబును చూసే ఉత్సాహంతో దగ్గరకు వెళ్లాలన్న ప్రయత్నంలో తొక్కిసలాట జరిగి కాల్వలో పడి మరణించారు. బహిరంగ ప్రదేశాల్లో సభలను ఏర్పాటు చేస్తే ఇటువంటి ప్రమాదాలు చోటుచేసుకోవు. రోడ్ షో అని చెప్పి నేతలు రోడ్డుపైనే సభలు పెట్టడం, టీవీ కెమెరాలకు ఎక్కువ మంది జనం కన్పించడం కోసం ఇరుకుసందులను ఎంచుకుంటున్నారు. అదే కందుకూరులో ప్రమాదానికి ప్రధాన కారణంగా మారిందని కందుకూరు స్థానికులు చెబుతున్నారు.
ప్రాణం ఖరీదు పది లక్షలా?
మృతులు విజయ (ఉలవపాడు), దేవినేని రవీంద్ర (ఆత్మకూరు), కకుమను రాజా(కందుకూరు) కలవకూరి యానాది (కందుకూరు), మర్లపాటి చిన కొండయ్య (గుండ్లపాలెం), పురుషోత్తం(కందుకూరు) గా గుర్తించారు. మరో ఐదుగురు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరిపరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. మృతుల కుటుంబాలకు పది లక్షలు చంద్రబాబు ప్రకటించినా ప్రాణం ఖరీదు పది లక్షలా ? అంటూ కామెంట్స్ వినపడుతున్నాయి. ఇకనైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఇరుకు సందుల్లో కాకుండా సభలను పెద్ద ప్రాంగణంలో ఏర్పాటు చేసుకోవడం మంచిదన్న సూచనలు వినిపిస్తున్నాయి.
Next Story