Fri Nov 22 2024 14:43:59 GMT+0000 (Coordinated Universal Time)
థాక్రే పనికి రాడా?... సంక్షోభం తప్పదా?
మహారాష్ట్ర లోని శివసేన ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. 12 మంది శివసేన ఎమ్మెల్యేలు పార్టీపై తిరుగుబాటుకు దిగారు.
మహారాష్ట్ర లోని శివసేన ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. 12 మంది శివసేన ఎమ్మెల్యేలు పార్టీపై తిరుగుబాటుకు దిగారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్బంగా ఈ విభేదాలు బయటపడ్డాయి. మంత్రి ఏక్నాధ్ షిండే నేతృత్వంలో 11 మంది ఎమ్మెల్యేలు పార్టీకి వ్యతిరేకంగా తిరుగుబాటుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అసంతృప్త ఎమ్మెల్యేలంతా గుజరాత్ లోని సూరత్ లోని గ్రాండ్ భగవతీ హోటల్ లో బస చేసి ఉన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో....
పది స్థానాలు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఐదు స్థానాల్లో విజయం సాధించాయి. శివసేన, ఎన్సీపీ రెండు ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ ఒక స్థానంలో విజయం సాధించాయి. బీజేపీకి కేవలం నలుగురిని గెలుచుకునే బలం ఉంది. అయినా ఐదు స్థానాలను గెలుచుకుంది. దీనికి ఏక్నాధ్ షిండే వర్గం సహకరించిందన్న ఆరోపణలున్నాయి. గుజరాత్ కు అసంతృప్త ఎమ్మెల్యేలు వెళ్లడం, అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉండటంతో ఖచ్చితంగా బీజేపీ ట్రాప్ లో షిండే పడినట్లేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రపతి ఎన్నికల్లో.....
మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలున్నాయి. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలకు కలసి 169 మంది సభ్యులున్నారు. బీజేపీ కూటమికి 113 స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఈ 12 మంది సభ్యులు బీజేపీకి మద్దతు పలికినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికే మెజారిటీ ఉంటుంది. అధికారంలో కొనసాగేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా శివసేనకు గట్టి ఎదురుదెబ్బే అని చెప్పుకోవాలి. రాష్ట్రపతి ఎన్నికలలో 12 మంది ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా ఓటు వేసేందుకు బీజేపీ ఈ ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది.
మూడేళ్ల తర్వాత....
ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే సర్కార్ లో మూడేళ్ల తర్వాత అసంతృప్తి తలెత్తడం చర్చనీయాంశమైంది. శివసేన ఎమ్మెల్యేలు గత కొంత కాలంగా ఉద్ధవ్ థాక్రే పై అసంతృప్తితో ఉన్నారని తెలిసింది. అసంతృప్తి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బయపడ్డారు. 12 నెంబరు తక్కువేమీ కాదు. దీంతో ఉద్ధవ్ థాక్రే శివసేన ఎమ్మెల్యేలతో మరికాసేపట్లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఎమ్మెల్యేలతో ఆయన స్వయంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకుంటారని తెలిసింది. కాగా ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ అభ్యర్థి చంద్రకాంత్ హోండోర్ ఓటమి పాలు కావడంపై కాంగ్రెస్ కూడా అసంతృప్తితో ఉంది. మరి ఉద్థవ్ థాక్రే ఎలా ఈ సమస్య నుంచి బయటపడతారన్నది వేచి చూడాలి. మరోవైపు శరద్ పవార్ సయితం ఎన్సీపీ ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశఆరు.
Next Story