Mon Dec 23 2024 01:03:03 GMT+0000 (Coordinated Universal Time)
సమ్మె అనివార్యం.. పీటముడి పడినట్లే
ఉద్యోగుల బలప్రదర్శన పూర్తయింది. చలో విజయవాడ కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకున్నారు
ఉద్యోగుల బలప్రదర్శన పూర్తయింది. చలో విజయవాడ కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకున్నారు. అంతవరకూ బాగానే ఉంది. తర్వాత ఏంటి? ప్రభుత్వం దిగి వస్తుందని భావించినా అది జరగే పరిస్థితి కన్పించడం లేదు. ప్రభుత్వం కూడా ఫర్మ్ గానే ఉందని అర్థమవుతుంది. జగన్ ను కలసి వచ్చిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి మాటలను చూస్తుంటే ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదనిపిస్తుంది. అందుకే ఇక సమ్మె అనివార్యంగా కన్పిస్తుంది.
మూడు రోజుల్లో....
మరో మూడురోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె ప్రారంభం కాబోతుంది. ఒకసారి సమ్మెలోకి వెళితే ఉద్యోగులు వెనక్కు తగ్గే అవకాశం ఉండదు. ఏదో ఒకటి సాధించుకుని మాత్రమే సమ్మెను విరమింప చేయాల్సి ఉంటుంది. కోవిడ్ సమయంలో సమ్మె చేయడాన్ని ప్రజలు హర్షించరు. వారి నుంచి ఉద్యోగులకు మద్దతు లభించదు. ప్రభుత్వం ఎస్మాలాంటి ప్రయోగాలు చేసినా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగులు లెక్క చేయరన్నది అందరికీ తెలిసిందే.
చర్చలు ఇక....
దీంతో ఆరో తేదీ అర్థరాత్రి నుంచి ఉద్యోగులు సమ్మె బాట పడుతున్నారు. చర్చలకు కూడా తాము మంత్రుల కమిటీ వద్దకు వెళ్లమని ఉద్యోగ సంఘాల నేతలు తెగేసి చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ వద్దకే తాము చర్చలకు వెళతామని చెప్పారు. అంటే ఇక మంత్రుల కమిటీ చర్చలకు పిలిచినా లాభం లేదు. అలాగని ప్రభుత్వం కూడా చూస్తూ ఊరుకుంటే ప్రజల్లో చులకన అవుతుంది. అందుకే చర్చలకు ప్రభుత్వం తలుపులు తెరిచే ఉన్నాయని పదే పదే చెబుతుంది.
ప్రభుత్వం కూడా....
ముఖ్యమంత్రి జగన్ సయితం ఉద్యోగులు వ్యవహారశైలిపై ఆగ్రహంతో ఉన్నారని తెలిసింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి తెలుసుకోకుండా ఉద్యోగులు పట్టుబడుతున్నారని భావిస్తున్నారు. ఉద్యోగుల గొంతెమ్మ కోర్కెలు తీర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదన్న సంకేతాలను ఇచ్చే అవకాశముంది. చలో విజయవాడ కార్యక్రమంతో ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య మరింత పీట ముడి పడినట్లేనని అనుకోవాలి. సమ్మెకు దిగి ఉద్యోగులు తమ డిమాండ్లు సాధించుకుంటారో? ప్రభుత్వం ఉద్యోగులపై పట్టుసాధిస్తుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
Next Story