Mon Dec 23 2024 02:48:58 GMT+0000 (Coordinated Universal Time)
రాహుల్ యాత్ర.. అడ్డుకుంటే పది లక్షల డాలర్ల బహుమతి
పంజాబ్ లో రాహుల్ పాదయాత్రను అడ్డుకుంటే పది లక్షల డాలర్లను బహుమతిగా ఇస్తామని సిక్ ఫర్ జస్టిస్ గ్రూప్ ప్రకటించింది
కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ గత నాలుగు నెలల నుంచి భారత్ జోడో యాత్ర చేస్తున్నారు. సెప్టంబరు 7వ తేదీన తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన రాహుల్ పాదయాత్ర ఇప్పటికే 1500 కిలోమీటర్లు దాటింది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ మీదుగా హర్యానాలో కొనసాగుతుంది. హర్యానాలో ప్రస్తుతం రాహుల పాదయాత్ర చేస్తున్నారు. ఆయన పాదయాత్ర తర్వాత పంజాబ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది.
భద్రత పెంచాలని...
అయితే పంజాబ్ లో రాహుల్ పాదయాత్రను అడ్డుకుంటే పది లక్షల డాలర్లను బహుమతిగా ఇస్తామని సిక్ ఫర్ జస్టిస్ గ్రూప్ ప్రకటించింది. దీంతో రాహుల్ గాంధీ భారత యాత్రకు మరింత భద్రత పెంచాలన్న డిమాండ్ కాంగ్రెస్ నుంచి ఊపందుకుంది. రాహుల్ యాత్ర సజావుగా సాగేలా, ఆయనకు రక్షణ ఏర్పాట్లు చేయాలని కాంగ్రెస్ కోరుతుంది. ఇప్పటి వరకూ రాహుల్ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజీ ధోరణిని అవలంబిస్తుందని పేర్కొంది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం తాము నిబంధనల మేరకే రాహుల్ కు భద్రత కల్పిస్తున్నామని చెబుతోంది.
ప్రత్యేక భద్రత...
మరోవైపు పంజాబ్ లో రాహుల్ యాత్ర ఎనిమిది రోజుల పాటు సాగనుంది. పంజాబ్ లోకి ప్రవేశించిన తర్వాత రాహుల్ గాంధీ పాదయాత్రపై భద్రతా ఏర్పాట్ల గురించి ఐజీపీ సుఖ్చైన్ గిల్ సమీక్షించారు. ప్రత్యేకంగా రాహుల్ యాత్రకు భద్రత ఏర్పాట్లు చేశామని గిల్ తెలిపారు. ఏడీజీపీ శ్రీవాస్తవ పాదయాత్ర పర్యవేక్షణ అధికారిగా ఉంటారని వెల్లడించారు. అన్ని జిల్లాల పోలీసు సూపరింటెండ్లకు, పోలీసు అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశామన్నారు. రాహుల్ చుట్టూ 150 మంది పంజాబ్ పోలీసులు రక్షణగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను అందించే సీఆర్పీఎఫ్ తో వీరు సమన్వయం చేసుకుంటారని గిల్ వెల్లడించారు. మొత్తం మీద పంజాబ్ లో రాహుల్ యాత్ర కొనసాగే ఎనిమిది రోజులు టెన్షన్ గానే కొనసాగుతుంది.
Next Story