Mon Nov 25 2024 07:00:20 GMT+0000 (Coordinated Universal Time)
కథ సుఖాంతం : ఫార్ములా రెడీ
కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్యను ఎంపిక చేశారు. అందుకు ఫార్ములాను సిద్ధం చేశారు
కర్ణాటక కాంగ్రెస్ కథ సుఖాంతమయింది. ఎన్నికలలో గెలిచినా గత కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి పదవిపై హైకమాండ్ ఎటూ నిర్ణయం తీసుకోలేకపోయింది. ఇద్దరు ప్రధాన నేతలు కావడంతో ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలన్న దానిపై హైకమాండ్ మల్లగుల్లాలు పడింది. ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలను సేకరించినా ఎవరి పేరు ఖరారు చేయాలన్న దానిపై అనేక సార్లు భేటీ అయింది. కసరత్తులు చేసింది.
ఇద్దరూ పార్టీకి...
ఇటు సిద్ధరామయ్య సీనియర్ నేతగా బీసీ వర్గాలలో మంచి పేరుంది. అదే సమయంలో డీకే శివకుమార్ కూడా పార్టీ బలోపేతం కావడానికి పడిన శ్రమను పరిగణనలోకి తీసుకుంది. ఇద్దరికీ నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా గత మూడు రోజుల నుంచి ఎవరూ తగ్గలేదు. చివరకు రాహుల్ గాంధీ కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇరువురితో రాహుల్ మాట్లాడి ఒక అంగీకారానికి తీసుకు వచ్చినట్లు తెలిసింది.
2+3 ఫార్ములా...
తొలి రెండేళ్లు ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ఉంటారు. అంటే లోక్సభ ఎన్నికల వరకూ సిద్ధరామయ్యే ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. రెండేళ్ల అనంతరం డీకే శివకుమార్కు మూడేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ఫార్ములాకు ఇద్దరూ అంగీకరించారు. దీంతో ఎల్లుండి సిద్ధరామయ్య కంఠీరవ స్టేడియంలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలి మూడేళ్లు డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు రెండు ముఖ్యమైన శాఖలను అప్పగించనున్నారు.
Next Story