సౌత్ ఇండియా కంటే పాకిస్థాన్ కి వెళ్లడమే మేలు
పంజాబ్ మంత్రి కమ్ మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి దక్షిణ భారతదేశాన్ని తక్కువగా చేసి పాకిస్థాన్ ని కీర్తించి ఆ దేశంపై మరోసారి తన ప్రేమను చాటుకున్నారు. సిద్ధూకు దక్షిణభారత దేశానికి పోవడం కంటే పాకిస్థాన్ కి వెళ్లటమే ఉత్తమము అనిపించిందట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా హిమాచల్ ప్రదేశ్ లో జరుగుతున్న లిటరేటర్ ఫెస్టివల్ లో చెప్పారు. దక్షిణాధి భాష ఆయనకు అర్థం కాదని, ఇక్కడి ఆహారం విషయంలోనూ ఇబ్బందే అని, ఇష్టం లేకున్నా ఇడ్లీనే తినాల్సి వచ్చిందని చెప్పాడు. అదే పాకిస్థాన్ లో మాత్రం పంజాబీ, ఇంగ్లీష్ మాట్లాడతారని అన్నాడు. గతంలో పాక్ ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారానికి సిద్ధూ హాజరై పాక్ ఆర్మీ చీఫ్ ను, పీఓకే ప్రధానిని కౌగిలించుకున్న విషయం తెలిసిందే. సిద్ధూకి పాకిస్థాన్ పై అంత ప్రేమ ఉంటే కాదనేవారు ఎవరూ లేరు కానీ పాకిస్థాన్ పై ప్రేమను చాటుకునేందుకు దేశంలో భాగమైన దక్షిణభారతాన్ని చులకన చేయడం మాత్రం ఆయనకు తగదు అని విమర్శలు వస్తున్నాయి.