వివాదాలు కొని తెచ్చుకోవడం అంటే ఇదే..!
పాకిస్తాన్ సాధారణ ఎన్నికల్లో మాజీ క్రికెటర్, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ గెలిచింది మొదలు మన మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ కాలు భూమి మీద నిలబడటం లేదు. తమ మిత్రుడు ఓ దేశానికి అధ్యక్షుడు అవుతున్నాడనో... తనను ప్రమాణస్వీకారానికి ఆహ్వానించడనో కానీ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. శనివారం ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారానికి ఒకరోజు ముందుగానే పాక్ లో దిగిపోయారు. అంత ఉత్సాహంగా పాక్ వెళ్లిన సిద్ధూ ఇప్పుడు పీకల్లోతు వివాదాల్లో చిక్కుకుపోతున్నారు. వాస్తవానికి సిద్ధూతో పాటు మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ ను కూడా ఇమ్రాన్ ఆహ్వానించినా వారు హాజరుకాలేదు. సిద్ధూ మాత్రం ఈ కార్యక్రమానికి హాజరై వివాదాలను కొని తెచ్చుకున్నారు.
పాక్ ఆర్మీ చీఫ్ ను కౌగిలించుకుని...
శనివారం ఉదయం పాక్ రాజధాని ఇస్తామాబాద్ ప్రసిడెంట్ హౌజ్ లో జరిగిన ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి సిద్ధూ అరగంట ముందుగానే వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే, వెళ్లామా...వచ్చామా అన్నట్లుగా కాకుండా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఈ ఉత్సాహంతో పాక్ ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ బజ్వాను ఆలింగనం చేసుకున్నారు. అంతేకాదు పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) అధ్యక్షుడు మసూద్ ఖాన్ పక్కనే కూర్చున్నారు. ‘‘పాకిస్తాన్ లో కొత్త ప్రభుత్వంతో నూతన ఉదయం మొదలైంది. ఇది దేశ భవిష్యత్తును మారుస్తుంది’’ అని ఇమ్రాన్ ను ఆకాశానికెత్తారు. సిద్ధూ చర్యలపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. దేశం కంటే స్నేహమే ముఖ్యమా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇక నెటిజన్ల నుంచి సైతం సిద్ధూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.