Sun Dec 22 2024 06:09:27 GMT+0000 (Coordinated Universal Time)
సిరివెన్నెలే కాదు.... భయపెట్టే అమావాస్య కూడా?
సిరివెన్నెల అంటే.. విరించినై విరచించితిని అనో..., లేదు ఆది భిక్షువు వాడినేది కోరేది అనో మేధోపరమైన పాటలే గుర్తు చేస్తారు
సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే.. విరించినై విరచించితిని అనో..., లేదు ఆది భిక్షువు వాడినేది కోరేది అనో మేధోపరమైన పాటలే గుర్తు చేస్తారు. అప్పటికే తెలుగు సినీ పరిశ్రమలో మహా వృక్షం గా ఎదిగిన వేటూరి సుందర రామ్మూర్తి ఎదుర్కోవాలంటే ఈ పాట ఒక్కటే సరిపోవని, మాస్ మాస్ మసాలా పాటలు కూడా రాస్తేనే 24 ఫ్రేముల సినీ ప్రపంచంలో నిలబడగలమని చెంబోలు సీతారామశాస్త్రి కి అర్థం అయింది. అందుకే బలపం పట్టి భామ ఒడిలో అనే పాట రాశారు. అడవంత అత్తారిల్లు నీకైనా నాకైనా... ఎవరెవరు అత్త మామ ఎట్లా తెలిసేదే అంటూ ఆటవిక సంస్కృతిని ఓ పాటలో కుదించారు. అమ్మహ అనేది మామూలు పదం... కమ్మహ ప్రయోగ పదం. ఈ పాటలోనే ఈ పదాన్ని ఉపయోగించి వేటూరి మర్చిపోండిరా బాబు..నేను వచ్చేసాను.. అని సినిమావాళ్ళకి, ఇటు మాస్ మహాశయులకు చెప్పారు.
పాటల గజరాజుగా...?
నిజానికి సిరివెన్నెలతో కాదు... బొబ్బిలి రాజా సినిమా తోటే సీతారామశాస్త్రి బలపం పట్టారు. సీతారామశాస్త్రి రాసిన పాటలకు శాఖ గ్రంథాలయాలకు వెళ్ళి అర్ధాలు వెతుక్కోవాల్సిన పని చాలా తక్కువ మంది చేశారు. తమ ఇంట్లోనూ, చుట్టుపక్కల ఇళ్లలోనూ జరిగే అనేక అనేక సంఘటనలు పాటల రూపంలో కళ్ళముందు ఉండటం లక్షల మంది చూశారు. ఇక్కడే సీతారామశాస్త్రి పాటల రచయిత గా విజయం సాధించారు. సిరివెన్నెల వంటి సినిమా ఏడాదికి ఒకటే. లేదు రెండో మూడో. బొబ్బిలి రాజా లాంటి సినిమాలు ఏడాదికి ఇరవయ్యో... ముఫ్ఫయ్యో... అదిగో అక్కడ గెలిస్తేనే అడవిలాంటి సినీ పరిశ్రమలో కుందేళ్లు నిలబడగలవు. సీతారామశాస్త్రి తన కుందేలు ప్రయాణాన్ని అక్కడే ప్రారంభించి పరిశ్రమలో పాటల గజరాజుగా ఎదిగారు.
తొలిరాత్రి ని.....
కూలి నెంబర్ వన్ సినిమాలో ఓ పాట ఉంటుంది. భార్యాభర్తలు గా మారిన దంపతుల తొలి రాత్రి కి సంబంధించిన పాట అది. ఆ పాటే కలయా..? నిజమా..?. ఈ పాట వింటే పెళ్లికాని కుర్రాళ్లు గానీ, అమ్మాయిలు గాని పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. పెళ్లయిన నడి వయస్కులు తమ తొలి రాత్రి ని గుర్తు చేసుకుంటారు. 60 ఏళ్లు పైబడినవారు ముసి ముసి నవ్వులు నవ్వుకుంటారు. ఈ పాటలో ఓ లైన్... " అలవాటులేని సుఖమా... నిన్ను ఆపతరమా " ఎంత అద్భుతం. సుఖం అలవాటు లేకపోవడం అనే ఆలోచన కొత్త దంపతులకే కలుగుతుంది.
ఆ వైవిధ్యమే....
ఈ పాటలో హీరో అంటాడు... "కుర్ర కళ్ళు చీర గళ్లలో దారే లేక తిరుగుతున్నవి.... అంతా మాయగా... కనిపించే కాలమా" అని. దానికి హీరోయిన్ సమాధానం " కాలు నేల నిలవకున్నది. ఆకాశాన తేలుతున్నది"... సిరివెన్నెల సినిమాకు పాటలు రాసిన సీతారామశాస్త్రి ఈ పాట రాశారు అంటే నమ్మగలరా...? నమ్మాలి. లేదంటే యూట్యూబ్ లో వెతుక్కోవాలి. నవ దంపతులకు మొదటి రేయి గురించి ఇంత అద్భుతమైన పాట రాసిన సీతారామశాస్త్రి.... అసలు పెళ్లే వద్దంటూ ఓ పాట రాశారు వద్దన్నాడు. పులికి, పెళ్లికి అక్షరాలు రెండే అంటాడు. అటు వైపు వెళ్తే పలావు అయిపోతావు అని హెచ్చరిస్తాడు. ఈ వైవిధ్యమే సీతారామశాస్త్రిని సినీ కవిగా నిలబెట్టింది. సినిమాల కోసం పాటలు రాయడం మనకు తెలుసు. పాట కోసమే సినిమా తీయడం.. అసలు ఊహించగలమా..? అలాంటి పాటే " జగమంత కుటుంబం నాది. ఏకాకి జీవితం నాది". ఈ పాటని ఆయన ఏ సినిమా కోసం రాయలేదు. ఎక్కడో ఏదో కదిలిస్తే అది కాస్త పాట అయిపోయింది. ఈ పాట కోసమే దర్శకుడు కృష్ణవంశీ... ప్రభాస్ హీరోగా చక్రి సినిమా తీశారు. సీతారామ శాస్త్రి అంటే సిరివెన్నెలే కాదు.. భయపెట్టే అమావాస్య కూడా.
- ముక్కామల చక్రధర్. సీనియర్ జర్నలిస్ట్
Next Story